సూర్యాపేటటౌన్ : పిల్లల ఆరోగ్యానికి మంచి ఆహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. లేకపోతే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. అపరిశుభ్రత కారణంగా కడుపులో నులిపురుగులు తయారవుతాయి. వీటి బారిన పడిన పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ ప్రతి సంవత్సరం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తుంది. 1 నుంచి 18 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఈ నెల 13 నుంచి మాత్రలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
1,82,000 మంది పిల్లలకు..
సూర్యాపేట జిల్లాలోని 1209 అంగన్‌వాడీ కేంద్రాలు, అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మాత్రల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా విద్యా సంస్థలలో మొత్తం 1,82,000 మంది పిల్లలకు మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ సోమవారం ఉదయం నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మాత్రలను ఈ నెల 13న మొదటి విడతగా, మిగిలిన పిల్లలకు 20న రెండో విడతగా పంపిణీ చేయనున్నట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు.
మాత్రలు ఇలా వేయాలి
ఒకటి నుంచి రెండు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు అల్బెండజోల్ సగం మాత్రను, రెండు నుంచి మూడేళ్ల లోపు వారికి ఒక మాత్రను పొడి చేసి, మూడేళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఒక మాత్రను చంపరించి, నమిలి మింగాలి. మాత్రల పంపిణీకి జిల్లాలోని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బందిని నియమించారు. వీరు ప్రతి ఇంటిని, పాఠశాలను సందర్శించి మాత్రలు పంపిణీ చేస్తారు.
నేటి నుంచి ఆల్బెండ జోల్ మాత్రల పంపిణీ
1 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలకు


