జిల్లాలో దరఖాస్తులు ఇలా...
నాగారం : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాస్’ పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద వ్యవసాయ రంగం, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ రూపొందించింది. ఈ పథకానికి గతేడాది వేలాది మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి గతేడాది జూన్ 2 నుంచి దశల వారీగా రుణాలు అందించాలని పథకం ప్రకటించిన సందర్భంలో ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఏడాది గడిచినా ఇంతవరకు ఒక్కరికి కూడా రుణం మంజూరు చేయలేదు. ప్రభుత్వం కేవలం దరఖాస్తులు స్వీకరించి వదిలేయడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
60,304 దరఖాస్తులు
రాజీవ్ యువ వికాస్ పథకంలో భాగంగా ఎస్టీ, ఎస్సీ బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దాంతో ఆయా సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజికవర్గాలకు చెందిన 60,304 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటగా ప్రభుత్వం దరఖాస్తు దారులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి యూనిట్ విలువ ప్రకారం అయిదు విడతల్లో మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది
రాయితీ రుణాల కోసం..
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికై న వారికి రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.50 వేల యూనిట్‌కు వందశాతం రాయితీ, రూ.లక్ష లోపు రుణానికి 80 శాతం రాయితీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 70 శాతం, రూ.4 లక్షలకు 60 శాతం రాయితీ ఇచ్చేలా పథకాన్ని రూపొందించింది. మొదటి విడత కింద రుణాలు అందించడం కోసం అధికారులు దరఖాస్తులను పరిశీలించి కొందరిని ఎంపిక చేశారు.
ఎదురు చూపులే..
దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి మొదటగా రూ. లక్షకు సంబంధించిన యూనిట్లను గతేడాది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. చివరి క్షణంలో పలు ఆరోపణలు రావడంతో రుణాల పంపిణీ వాయిదా వేసింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఒక్క యూనిట్ కూడా మంజూరు చేయలేదు. రుణాలు మంజూరు చేస్తే వాటితో స్వయం ఉపాధి ఏరా్పాటు చేసుకొని జీవనం సాగించాలని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తోంది. ప్రభుత్వం రుణాల మంజూరుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఎస్సీ 16,376
ఎస్టీ 8947
బీసీ 29,112
ఈబీసీ 1838
ముస్లిం మైనార్టీ 3935
క్రిస్టియన్ మైనార్టీ 96
మొత్తం 60,304
ఫ ఏడాది గడిచినా యువతకు
అందని రుణాలు
ఫ జిల్లా వ్యాప్తంగా
60,304 దరఖాస్తులు
ఫ తీవ్ర నిరాశలో నిరుద్యోగులు


