భానుపురి (సూర్యాపేట) : సోషల్ ఎకనామిక్ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్‌లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, అధికారులు మూడు వారాల పాటు సర్వే చేసి సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేసేందుకు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తాత్కాలికంగా నియమించుకున్నారు. వీరికి చెల్లిస్తామని చెప్పిన రిమ్యూనరేషన్ నిధుల లేమితో ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉంది.
2వేల మంది ఆపరేటర్లు
సమగ్ర కుటుంబ సర్వేలో 75 ప్రశ్నలు ఉండడంతో డేటాను ఎంట్రీ చేసే వారు అధిక సమయం కేటాయించాల్సి వచ్చింది. అందుకే ఎక్కువ మందిని డేటా ఎంట్రీ కోసం తీసుకున్నారు. ఒక్కో ఫారాన్ని నమోదు చేస్తే రూ.29 చొప్పున చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించినట్లు అధికారులు చెబుతున్నారు. పని పూర్తయి నెలలు గడుస్తున్న తమకు ఇస్తామన్న డబ్బులు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు.
రూ.1.07 కోట్లు విడుదల
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కుటుంబాలకు సంబంధించిన డేటాను ఆపరేటర్లు ఆన్‌లైన్ చేశారు. ఇందుకుగాను ఒక్కో ఫారానికి రూ.29 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.1,07,31,170లను కేటాయించింది. ఈ నిధులు మండలాల వారీగా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల వివరాలు సేకరించి వారికి డబ్బులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఏడాదిన్నర క్రితం సోషల్ ఎకనామిక్ సర్వే
డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లకు
ఇవ్వాల్సిన నిధులు విడుదల
తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు కేటాయింపు


