భానుపురి (సూర్యాపేట) : యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. జిల్లాలో సాగైన వరి ఎంత.. ఎంత దిగుబడి రానుంది.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తుంది.. ఈ మేరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్న అంచనాలతో జిల్లా యంత్రాంగం కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. మరో పది రోజుల్లో వరి కోతలు ఊపందుకోనుండడంతో ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 4.82 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇందులో సన్నాలు 2 లక్షల ఎకరాల వరకు ఉండనుంది. మిగతాది దొడ్డు రకం ఉండగా.. మొత్తంగా ధాన్యం దిగుబడి దాదాపు 8 నుంచి 9 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 335 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతంలో మాదిరిగానే సన్నరకం ధాన్యానికి, దొడ్డురకం ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ ప్రాంతంలో మొదటగా వరి కోతలు ప్రారంభం కానున్నాయి.. అక్కడ సాగైన వరి ఏ రకం.. అన్న ఆధారంగా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఇందులో ఏ శాఖ నుంచి ఎన్ని సెంటర్లు నడపనున్నాయని.. ఎక్కడ అన్నది క్షేత్ర స్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
మిల్లుల కేటాయింపు నుంచి రవాణా దాకా..
యాసంగి ధాన్యం కేటాయింపుల కోసం మిల్లుల గుర్తింపు ప్రక్రియను సైతం అధికారులు చేపట్టారు. బ్యాంకు గ్యారెంటీలు, అగ్రిమెంట్ సమర్పించిన మిల్లులకే ఈ సీజన్‌లో ధాన్యం కేటాయించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసేందుకు కావాల్సిన వాహనాలకు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ మండల స్థాయి కమిటీ ఇచ్చే సిఫారసుల మేరకు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రైతుల డిమాండ్ మేరకు కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉంటుంది. రైతులకు రవాణా చార్జీలు సైతం తగ్గి.. అందుబాటులో సెంటర్లు ఉండనున్నాయి. ఇక గన్నీ బ్యాగులను మిల్లర్ల నుంచి సేకరించి కేంద్రాల ప్రారంభం నాటికి సిద్ధం చేయనున్నారు. దాదాపు కోటి ఐదు లక్షల మేర గన్నీ బ్యాగులు ఈ సీజన్‌లో అవసరవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
యాసంగి వరి సాగు విస్తీర్ణం 04.82 లక్షల ఎకరాలు ధాన్యం దిగుబడి అంచనా 9 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం 4.10 లక్షల మెట్రిక్ టన్నులు
ఫ యాసంగి ధాన్యం సేకరణకు సన్నాహాలు
ఫ 4.10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యం
ఫ గన్నీ బ్యాగులు, ఇతరత్రా సౌకర్యాల కల్పనకు కార్యాచరణ


