గుర్రంపోడు : బత్తాయి రైతుకు సీజన్ ఆరంభంలోనే కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వ్యాపారం పుంజుకునే ప్రస్తుతం తరుణంలో ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుండడం, ఈ నెలలో ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో మార్కెట్‌పై ప్రభావం పడింది. దీంతో ప్రస్తుత వేసవిలో బత్తాయి ధర పెరగకపోగా కోతలు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా బత్తాయి, నిమ్మ కాయలకు అంతగా విదేశీ ఎగుమతులు ఉండవు. ఎగుమతులకు అవసరమయ్యే లారీల కొరత కారణంగా మార్కెట్ స్తంభించింది.
సొంత ప్రాంతాలకు వెళ్లిన లారీలు
ఢిల్లీ పరిసర ప్రాంతాల లారీల డైవర్లు హోలీ పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయి ఇంకా తిరిగా రాలేదు. ఈసారి కురిసిన అధిక వర్షాలకు కశ్మీర్‌లో ఆపిల్ పంట దెబ్బతినడంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. యుద్ధ ప్రభావం వల్ల విదేశాల నుంచి విమానాల ద్వారా ఆపిల్, ఇతర పండ్ల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో లారీలకు కిరాయిలు దొరకక అక్కడే నిలిచిపోవడంతో ఇక్కడ లారీల కొరత ఏర్పడింది. రంజాన్ పండుగ కారణంగా కూలీల కొరత, మార్కెట్‌లో క్రయవిక్రయాల్లో మందగమనం నెలకొంది.
కత్తెర పంట కోతలోనూ జాప్యం
బత్తాయి కత్తెర దిగుబడులు సాధారణంగా మార్చి నెల నుంచి ప్రారంభమమవుతాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల కత్తెర ముందు సీజన్ కాయల కోతలు పూర్తికాలేదు. ఆ కాయలకు కత్తెర దిగుబడుల్లో కలిసి అధిక ధర వస్తుందని ఆశిస్తున్నా కోయడంలో జాప్యం జరిగి కాయలు రాలిపోతున్నాయి. ఇప్పటికే రేటు కుదుర్చుకున్న వ్యాపారులు పలు కారణాల వల్ల కాయలు కోయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధరలేని కత్తెర పంట
ఫ వరుస పండుగలు..
లారీల కొరతే కారణం
ఫ యుద్ధ ప్రభావంతో
నిలిచిన ఎగుమతులు


