కోదాడ : ఆకులు, కాయలు, కాండం, బెరడు ఇలా అన్నిట్లో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లకు సుస్తి చేసింది. ఇండియన్ హెర్బల్ డాక్టర్‌గా పిలుచుకునే వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. శిలింధ్ర వ్యాధి కారణంగానే చెట్లు ఎండిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవిలో పచ్చటి ఆకులు, పూతతో కనిపించాల్సిన వేపచెట్లు ప్రస్తుతం ఎండిపోయి, ఆకురాలి మోడువారి దర్శన మిస్తున్నాయి.
డైబ్యాక్ తెగులు
వేపచెట్లు ఎండిపోవడానికి డైబ్యాక్ అనే శిళీంధ్ర వల్ల కలిగిన తెగులు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి శీతాకాలం నుంచి ఎండకాలంలోకి మారే సమయంలో సోకుతుందని తెలుపుతున్నారు. వేపచెట్లకు ‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ అనే శిలీంధ్రం సోకడంతో చెట్టు చివరి భాగాల నుంచి ఎండిపోవడం ప్రారంభమై కొద్ది రోజుల్లోనే మొత్తం వ్యాపిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే చెట్టుమొత్తం ఎండిపోతుందని, గాలి వల్ల ఈ వ్యాధి ఒక చెట్టు నుంచి మిగతా వాటికి వ్యాపిస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం కనిపించిన ఈ వ్యాధి ఆ తరువాత కొంత తగ్గుముఖం పట్టింది. మళ్లీ మూడు నెలలుగా మళ్లీ విజృంభిస్తోంది. దాంతో ఈ సంవత్సరం ఉగాది పచ్చడికి వేపపూత దొరకడం కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తీవ్ర నష్టం
వేపచెట్లు వ్యాధి బారిన పడడంతో పూత, కాత పూర్తిగా తగ్గిపోతోంది. వేప కాయలు, దాని నుంచి వచ్చే నూనెను వ్యవసాయరంగంలో విరివిగా ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో వేపనూనే, వేప పిట్టుకు అధిక ప్రాధాన్యత ఉంది. కూరగాయలు, పండ్లమొక్కలకు వచ్చే వ్యాధుల నివారణలో వేప కాయలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం వేపచెట్లు వ్యాధి బారిన పడడంతో దిగుబడి 80 నుంచి 90 శాతం వరకు తగ్గిపోతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
నివారణ చేపట్టాలి
వేపచెట్లకు వచ్చిన ఈ వ్యాధి నివారణకు ఎవరు చర్యలు తీసుకోవాలన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు ఈ విషయమై పట్టించుకోవడం లేదు. గాలి ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఒకటి, రెండు చెట్లకు మందులు పిచికారీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రభుత్వమే సామూహిక నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. చిన్న చెట్లు వ్యాధి బారిన పడినట్లు గుర్తిస్తే ఆ కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలని, శిలీంధ్రనాశక ఔషఽధమైన కార్బెండజిమ్ పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద చెట్లకు మందు పిచికారీ చేయడం కష్టమైతే శిలీంధ్ర నాశక ఔషధాన్ని నీటిలో కలిపి చెట్ల మొదళ్లలో పోయాలి. వేసవిలో చెట్లకు నీరు పెట్టడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి నుంచి బయటపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఆపదలో ఔషధి
ఎండిపోతున్న వేపచెట్లు
శిలీంధ్ర తెగులే కారణమంటున్న శాస్త్రవేత్తలు
నివారణ చర్యలు చేపట్టాలంటున్న
పర్యావరణ వేత్తలు


