భానుపురి (సూర్యాపేట) : ఈ నెల 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్ధవంతంగా అందించడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు యూత్ వీక్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి టెలి కమ్యూనికేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక నుంచి అన్ని ఫైళ్లు ఈ–ఆఫీస్ ద్వారానే పంపాలని స్పష్టం చేశారు. ప్రత్యేకాధికారులు సంక్షేమ గృహాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని,
టాస్క్ ద్వారా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని
తెలిపారు. మున్సిపాలిటీలు, పంచాయతీలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రగ్స్ నివారణ, పిల్లల రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించాలని సూచించారు. భూ సేకరణ, అటవీ అనుమతులపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు – మనబడి పెండింగ్ బిల్లులపై నివేదిక సమర్పించాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


