ఒకేసారి మూడు నెలల రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి మూడు నెలల రేషన్‌

Mar 5 2026 7:42 AM | Updated on Mar 5 2026 7:42 AM

భానుపురి (సూర్యాపేట) : రేషన్‌ కార్డు దారులకు మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఒకే సారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేసవితో పాటు గోదాంలలో బియ్యం నిల్వలను తగ్గించేందుకు ఏప్రిల్‌లోనే మే, జూన్‌కు సంబంధించిన కోటాను కూడా పంపిణీ చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బియ్యం రవాణాకు సంబంధించిన ఖర్చులు కొంత మేర ఆదా కానున్నాయి. గత జూన్‌లోనూ మూడు నెలల రేషన్‌ ఒకేసారి ఇచ్చారు.

జిల్లాలో 3,55,057 రేషన్‌ కార్డులు

సూర్యాపేట జిల్లాలో 610 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. గతంలో 3.26 వేల రేషన్‌ కార్డులు ఉండగా ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో 30వేల కార్డులను మంజూరు చేసింది. ప్రస్తుతం 3,55,057 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా సుమారు 6 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందిస్తోంది. గత ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

నిల్వలు పేరుకు పోవడంతో..

కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా తిరిగి ఆహార భద్రత కార్డు దారులకు అందిస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌సీఐ గోదాంలలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. బియ్యం ముక్కి పోకుండా ఉండేందుకు లబ్ధిదారులకు ఇవ్వడమే మేలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది కూడా జూన్‌, జూలై, ఆగస్టులకు సంబంధించి బియ్యం కోటాను జూన్‌లోనే పంపిణీ చేసింది. ఈ సమయంలో లబ్ధిదారుల నుంచి మూడుసార్లు వేలిముద్రలు తీసుకున్నారు. దుకాణాల వద్ద రద్దీ కారణంగా సర్వర్‌ సమస్యలు తలెత్తడంతో డీలర్లు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బియ్యం క్వాలిటీలోనూ తేడాలు వచ్చాయి.

బియ్యం నిల్వలపై ఆరా

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో బియ్యం నిల్వలపై జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాకు సీఎంఆర్‌ కేటాయింపులు ఉండడంతో మూడు నెలలకు సరిపడా బియ్యం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.

ఏప్రిల్‌, మే, జూన్‌ కోటా ఏప్రిల్‌ నెలలోనే..

ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం

వేసవితో పాటు గోదాముల్లో నిల్వలు తగ్గించేందుకే ముందస్తుగా పంపిణీ

సర్వర్‌ సమస్యలు రాకుండా

చూడాలంటున్న లబ్ధిదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement