14న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

14న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

Mar 5 2026 7:42 AM | Updated on Mar 5 2026 7:42 AM

హుజూర్‌నగర్‌ : రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 14న మోడల్‌ హౌసింగ్‌ కాలనీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. బుధవారం హుజూర్‌నగర్‌ శివారులోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్‌ హౌసింగ్‌ కాలనీ పనులను ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవాలతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ గృహ కాలనీ ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. సీఎం ప్రసంగించేందుకు ప్రత్యేక సభా వేదికను సిద్ధం చేస్తున్నామన్నారు. వారంలోగా అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో 2,160 కుటుంబాలకు సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. 2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారని, ఈ ప్రాంతాన్ని చెత్త మైదానంగా మార్చారని ఆరోపించారు. అదృష్ట వశాత్తు 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్‌కు కొత్త ఊపిరి పోసిందని మంత్రి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన, అత్యంత పేద కుటుంబాల కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్‌లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలనే ఆర్‌డీఓ ఆధ్వర్యంలో అధికారుల బృందానికి బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. మొదటి విడతలో వేయి మంది లబ్ధిదారులను ఖరారు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా, నిజమైన లబ్ధిదారులకు అందేలా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్పీ కె. నరసింహ, హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్‌ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ తన్నీరు మల్లికార్జున్‌రావు, మున్సిపల్‌ ఫోర్ల్‌ లీడర్‌ కోతి సపంత్‌రెడ్డి, తహసీల్దార్‌ కవిత, డీసీసీ అధ్యక్షుడు జి నరసయ్య, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు ఉన్నారు.

మోడల్‌ హౌసింగ్‌ కాలనీ

ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement