సీఎంఆర్‌ ధాన్యంతో | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ ధాన్యంతో

Mar 5 2026 7:42 AM | Updated on Mar 5 2026 7:42 AM

కోదాడ : మిల్లులకు కేటాయించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)తో పలువురు మిల్లర్లు కొత్త దందాకు తెరలేపారు. మిల్లుల ఆవరణలో ఉన్న ధాన్యం తమదే అని చెప్పి పలు బ్యాంకుల నుంచి ఓపెన్‌ క్యాష్‌ క్రెడిట్‌ (ఓసీసీ) రుణాలను కోట్లలో తీసుకుంటున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమచారం ప్రకారం.. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే మిల్లర్లు సీఎంఆర్‌ ధాన్యం హామీగా చూపి పలు జాతీయ బ్యాంకుల నుంచి రు.100 కోట్ల వరకు రుణాలు ఈ విధంగా తీసుకున్నారు. బ్యాంకులు కూడా ఈ ధాన్యం ఎవరిదన్న విషయాన్ని పట్టించుకోకుండా కోట్ల రూపాయల రుణాలను సులువుగా ఇస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యాన్ని మరాడించి.. బియ్యం తిరిగి అప్పగించాల్సిన మిల్లర్లు సంవత్సరాల తరబడి బియ్యం ఇవ్వకుండా వాటిని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మరోపక్క ఈ ధాన్యం హామీగా చూపి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సైతం ఎగవేతకు పాల్పడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులో ధాన్యం ఉందా లేదా అని నిత్యం పరిశీలించాలి. కానీ, వేల టన్నుల ధాన్యం మిల్లుల నుంచి బహిరంగ మార్కెట్‌కి తరలి వెళ్లినా ధాన్యం కేటాయించిన అధికారులు గానీ, కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన బ్యాంకులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి.

ఒక జిల్లా మిల్లుకు

మరో జిల్లాలోని బ్యాంకు రుణం..

జనగామ జిల్లాలో ఉన్న ఓ మిల్లుకు 2022–23 యాసంగి, 2024–25 వానాకాలం సీజన్లకు సంబందించిన ధాన్యం సీఎంఆర్‌ కింద కేటాయించింది. దీన్ని హామీగా చూపి సదరు మిల్లు యాజమాన్యం యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌ ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి రూ.3 కోట్ల రుణం పొందింది. ఈ మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి సీఎంఆర్‌ ఎగవేతకు పాల్పడడంతో పాటు, బ్యాంకు నుంచి తీసుక్ను రుణాన్ని కూడా చెల్లించలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 15 మిల్లులపై అధికారులు ఆర్‌.ఆర్‌ యాక్ట్‌, బ్యాంకులు సెక్యూరిటైజేషన్‌ యాక్ట్‌ ప్రయోగించినప్పటికీ.. ఏ ఒక్కరి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తిరిగి వసూలు చేయలేకపోయారు. మిల్లర్లు ముందస్తుగానే తమ ఆస్తులను బినామీల పేరుతో ఉంచడంతో ఈ చట్టాలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయి.

మాఫియాగా మారిన ముఠా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో మిల్లులు సీఎంఆర్‌ ధాన్యం తీసుకుంటున్నప్పటికి వారిలో కేవలం 15 మంది మిల్లర్లే ప్రతి సంవత్సరం అవకతవకలకు పాల్పడుతున్నారు. కోదాడ, నల్లగొండ ప్రాంతాల్లోని వీరంతా ముఠాగా ఏర్పడి ఇబ్బందులున్న మిల్లు యాజమాన్యాలకు రుణాలిప్పిస్తామని దానిలో భాగస్వాములుగా చేరుతారు. అధికారులతో తమకు ఉన్న సంబంధాలతో భారీ మొత్తలో సీఎంఆర్‌ ధాన్యం కేటాయింపజేసుకొంటారు. దీనిపై బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంటారు. ఇక తమ ప్లాన్‌ ప్రకారం సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తారు. దీంతో మిల్లును అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. బ్యాంకులు మిల్లును బహిరంగ వేలం వేస్తారు. విచిత్రంగా ఈ ముఠానే వేలంలో మిల్లును తమ అనుచరులతో కొనిపించి కొత్త ఫర్మ్‌ పేరుతో మళ్లీ ధాన్యం కేటాయింపజేసుకుంటారు. ఇక.. మిల్లు అసలు యజమానులు రోడ్డున పడుతున్నారు. దీనిపై పూర్తి స్ధాయిలో విచారణ జరపాలని పలువురు మిల్లర్లు కోరుతున్నారు. వీరి వల్ల తమందరికి చెడ్డపేరు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ధాన్యాన్ని హామీగా చూపి రుణాలు తీసుకున్న మిల్లర్లు

సూర్యాపేట జిల్లాలో ఈ విధంగా రూ.100 కోట్ల రుణాలు

ధాన్యం పక్కదారి పట్టించి

రుణాలు ఎగవేత

రికవరీ చట్టాలున్నా

ఏమీచేయలేకపోతున్న బ్యాంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement