చివరి రోజు హోరెత్తించారు | - | Sakshi
Sakshi News home page

చివరి రోజు హోరెత్తించారు

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

చివరి రోజు హోరెత్తించారు

చివరి రోజు హోరెత్తించారు

భానుపురి, సూర్యాపేట టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 4న మొదలైన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5గంటలకు తెరపడింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చివరి రోజు పోటాపోటీగా ఇంటింటి ప్రచారం చేశారు. ఆయా పార్టీల నేతలు రోడ్‌షోలు, ర్యాలీలు, సభలతో హోరెత్తించారు. ప్రధానంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను చుట్టివచ్చారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఓటర్ల ప్రసన్నానికి మంగళవారం చివరి అవకాశం ఉండడంతో ప్రలోభాలకు తెరలేపనున్నారు.

రంగంలోకి కీలక నేతలు

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ఈనెల 4వ తేదీన మొదలైంది. అన్ని పార్టీల అభ్యర్ధులు ఇంటింటికి తిరిగి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. ఖర్చులకు వెనుకాడకుండా కోలాటాలు, డప్పు వాయిద్యాలతో ర్యాలీలు తీస్తూ భారీ జనసమూహాలతో అభ్యర్థులు బల ప్రదర్శన చేశారు.

నేడు పోలింగ్‌ సామగ్రి పంపిణీ

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ బుధవారం జరగనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 2,26,646 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకుగాను 372 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ఐదు డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. హుజూర్‌నగర్‌ ఏఎంసీ గోదాంలో 56 పోలింగ్‌ కేంద్రాల సామగ్రి, కోదాడ సీసీ రెడ్డి కాన్వెంట్‌లో 91 సెంటర్ల సామగ్రి, నేరేడుచర్ల శ్రీరాచకొండ సీతారామనర్సయ్య ఫంక్షన్‌ హాల్‌లో 30 సెంటర్ల సామగ్రి, సూర్యాపేట శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో 165 సెంటర్ల సామగ్రి, తిరుమలగిరి ఎస్‌ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో 30 సెంటర్లకు సంబంధించిన పోలింగ్‌ సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు మంగళవారం ఉదయం నుంచే ఆయా సెంటర్లకు చేరుకుని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి సామగ్రి తీసుకోనున్నారు.

పోలింగ్‌ రోజున స్థానిక సెలవు

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగానికి 11వ తేదీన (బుధవారం) స్థానిక సెలవుగా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికల పోలింగ్‌కు వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు అన్నింటికి ఈనెల 10వ తేదీతో పాటు 11న స్థానిక సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

భారీ జనసమూహాలతో

అభ్యర్థుల బల ప్రదర్శన

ఓటర్లను ఆకర్షించేందుకు

నేడు డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధం

డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సోమవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగియడంతో అభ్యర్ధులు ఎలాగైనా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించి ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా మద్యం, డబ్బులు, ఇతర తాయిలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు అభ్యర్ధులు ఇప్పటి వరకు ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించగా.. ఇకపై వెనుకడుగు వేయకుండా ఖర్చు చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.3000 వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement