కాంగ్రెస్‌కు ఓటేస్తే గోస పడతాం
సూర్యాపేటటౌన్ : మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే మరింత గోస పడతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సోమవారం సూర్యాపేట పట్టణంలో అన్ని మున్సిపల్ వార్డుల అభ్యర్థులు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో మీకేం లాభం జరిగిందో ఆలోచన చేయాలన్నారు. సీఎం, ఆయన మంత్రి వర్గమంతా దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. సూర్యాపేటకు మంజూరైనా నిధులు వెనక్కి పంపిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం ఆధునీకరణకు రూ.25 కోట్లు, మహిళా పాలిటెక్నికల్ కళాశాల హాస్టల్ భవనానికి రూ.25కోట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కోట్లాది రూపాయలను వెనక్కి పంపారన్నారు. అరాచక కాంగ్రెస్‌ను నమ్మి.. అభివృద్ధి చేసే కేసీఆర్‌ను వదులుకున్నారన్నారు. మళ్లీ కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఒరిగేదేమీ లేదని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సరైన బుద్ధి చెప్పారన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


