కష్టపడే కార్యకర్తలకే పదవులు
ఫ పీసీసీ పరిశీలకులు బిజ్జి చత్రురావు, మానాల మోహన్‌రెడ్డి
భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కష్టపడే ప్రతి కార్యకర్తకూ పదవులు వస్తాయని, అన్ని మండలాల నుంచి డీసీసీ కార్యవర్గాన్ని కూర్పు చేస్తున్నామని పీసీసీ పరిశీలకులు బిజ్జి చత్రురావు, మానాల మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గానికి ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు జనరల్ సెక్రటరీలు, మండలానికో సెక్రెటరీని నియమించి జనవరి ఒకటో తేదీ వరకు డీసీసీ నూతన కమిటీ ఎన్నికను పూర్తిచేస్తామన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడకుండా నూతన కార్యవర్గానికి బాసటగా నిలవాలన్నారు. అందరి సహకారంతోనే జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీ స్థానాలను గెలుపొందామని, గెలుపునకు కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ పార్టీ కమిటీలు వేయకుండా కార్యకర్తలతో గులాంగిరి చేయించుకుందని, మన పార్టీకి అన్ని రకాల కార్యవర్గాలు ఉన్నాయన్నారు. నూతన కార్యవర్గం అందరిని కలుపుకుని పనిచేస్తూ రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని కోరారు. పదేళ్లలో జరిగిన అవినీతిలో జగదీష్‌రెడ్డికి కూడా భాగం ఉందని ఆరోపించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, డీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


