ఇ–నామ్.. అమలేది?
జిల్లాలో రెండు మార్కెట్లలో..
తిరుమలగిరి (తుంగతుర్తి) : రైతులు పండించిన పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడి మార్కెట్‌లోనైనా విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇ–నామ్ విధానం నామమాత్రంగానే కొనసాగుతోంది. ఈ విధానం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోక రైతులకు మద్దతు ధర అందడం లేదు. 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇ–నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్) విధానాన్ని తెచ్చింది. దేశంలోని 617 మార్కెట్‌లను దీని పరిధిలోకి తీసుకొచ్చి ఒక్కో యార్డులో రూ.5 లక్షల వ్యయంతో కంప్యూటర్లు, ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొమ్మిది సంవత్సరాలు దాటినా ఇ–నామ్ యార్డులను జాతీయ సర్వర్‌తో అనుసంధానించలేదు. ఇప్పటికీ రైతుల పంట ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో వేరే రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. మొత్తంగా స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తుండడంతో ధరల్లో పెరుగుదల పెద్దగా ఉండడం లేదు.
కంప్యూటర్ ద్వారా
ధరల నిర్ణయం ఒక్కటే మార్పు..
గతంలో మార్కెట్లలోని బీట్‌లో వేలం ద్వారా వ్యాపారులు ధరలు నిర్ణయించి రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. అయితే ఇ–నామ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కంప్యూటర్ల ద్వారా ధరలు కోడ్ చేస్తున్నారు. ఈ ఒక్క మార్పు తప్పితే ఈనామ్ విధానం వచ్చాక పంట ఉత్పత్తుల ధరల్లో కూడా ఏమాత్రం పెరుగుదల లేకపోవడంతో రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదు.
అమలైతే పదిశాతం అధికం
ఇ–నామ్ మార్కెట్ల పరిధిలో గుర్తింపు పొందిన వ్యాపారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరుకులు కొనుగోలు చేయవచ్చు. ఏ మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేసినా సదరు వ్యాపారి తమ ప్రాంతానికే తరలించుకోవచ్చు. ఈ పద్ధతి ప్రకారం మార్కెట్ కార్యదర్శి ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు వ్యాపారులు పోటీలో ఉంటే కనీసం 10 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. జాతీయ ఏకీకృత మార్కెట్‌కు విస్తరిస్తే దూర ప్రాంతాల వ్యాపారులు ఆన్‌లైన్ ద్వారానే మన దగ్గరి మార్కెట్లలోని ఉత్పత్తులను కొనవచ్చు. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఈ మేరకు అన్ని యార్డులను ఇ–నామ్ సర్వర్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది.
జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్ యార్డులను ఇ–నామ్ పరిధిలోకి చేర్చారు. ఇ–నామ్ పరిధిలోకి చేర్చినా స్థానిక వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దూరప్రాంతాలకు చెందిన వ్యాపారులెవరూ ఇక్కడి పంట ఉత్పత్తులను కొనడం లేదు. ఈ విధానంలో ఒక్క వేరుశనగ మాత్రమే వేరే ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి వ్యాపారులతో కొనుగోలు చేయించి తీసుకెళ్తున్నారు. ఇప్పటికై నా జిల్లాలోని రెండు మార్కట్లలో ఇ–నామ్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తమకు లబ్ధిచేకూరేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విధానం నామమాత్రం
ఫ దేశంలో ఎక్కడి నుంచైనా
పంట ఉత్పత్తులు కొనేలా
ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
ఫ అన్ని మార్కెట్లకు అనుసంధానించని జాతీయ సర్వర్
ఫ స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తున్న
పంట ఉత్పత్తులు
ఫ రైతులకు చేకూరని ప్రయోజనం
ఇ–నామ్.. అమలేది?


