డీసీసీ అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య
సూర్యాపేట, తిరుమలగిరి(తుంగతుర్తి) : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల పీసీసీ, ఐఏసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి డీసీసీ పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి 12 మంది దరఖాస్తు చేసుకోగా.. పరిశీలకులు అధిష్టానానికి ఆరుగురి పేర్లతో కూడిన జాబితా పంపారు. ఇందులో ఎస్సీ(మాదిగ) వర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్యకు పదవి దక్కింది.
అజ్ఞాతం నుంచి రాజకీయాల్లోకి..
నిరుపేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గుడిపాటి నర్సయ్య కాంగ్రెస్ పార్టీకి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి విధేయుడిగా ఉన్నారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో జన్మించిన నర్సయ్య ప్రాథమిక విద్య స్వాగ్రామంలోనే పూర్తిచేశారు. తుంగతుర్తిలో ఇంటర్, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. గుడిపాటి నర్సయ్య.. కళాశాల స్థాయి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపారు. విప్లవ పార్టీకి ఆకర్షితుడైన నర్సయ్య 1990 నుంచి 1995 వరకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చండ్రా పుల్లారెడ్డి వర్గంలో చేరి అజ్ఞాత జీవితం గడిపారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సూచనల మేరకు అప్పటి నల్లగొండ ఎస్పీ రవిగుప్త సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా దామోదర్‌రెడ్డి చెరదీసి జడ్పీటీసీగా అవకాశం కల్పించారు. 2001 నుంచి 2006 వరకు తుంగతుర్తి జడ్పీటీసీగా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2009లో తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులయ్యారు. 2009లో తుంగతుర్తి నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా.. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు భీఫామ్ ఇచ్చింది. నర్సయ్య 2014 నుంచి 2018 వరకు టీపీసీసీ సభ్యుడిగా పనిచేశాడు. పార్టీలో చేరిన నాటినుంచి ఇప్పటి వరకు పార్టీకి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి విధేయుడిగా ఉన్నారు. దీంతో అధిష్టానం గుడిపాటి నర్సయ్యకు డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది.
ఫ ఐదేళ్లపాటు అజ్ఞాత జీవితం
ఫ మాజీ మంత్రి ఆర్డీఆర్ సూచనతో
రాజకీయాల్లోకి
ఫ తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ
ఫ ప్రస్తుతం పీసీసీ సభ్యుడిగా ఉన్న నర్సయ్య


