28న భగవద్గీత ప్రతిభా పోటీలు
సూర్యాపేట : గీతా జయంతిని పురస్కరించుకుని దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా స్థాయి పాఠశాల విద్యార్థులకు ఈనెల 28న జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో భగవద్గీత ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వాహకులు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు నిర్దేశించిన 10 భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయాలని, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు భగవద్గీతలోని 1 నుంచి 6 అధ్యాయాలపై ప్రతిభా పరీక్షకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనేవారు 25 తేదీ లోపు పేర్లు నమోదు చేయించుకోవాలని, పూర్తి వివరాలకు 9848749022 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల
నివారణకు కృషి
సూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషిచేస్తోందని, దీనిలో భాగంగా రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి–65 కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్ వద్ద స్థానిక ప్రజలు జాగ్రత్తగా రోడ్లు దాటాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులపై వాహన నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయొద్దన్నారు. ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా 43 రోడ్డు ప్రమాద నివారణ కమిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
హుజూర్‌నగర్‌కు
రెండు కోర్టులు మంజూరు
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌కు నూతనంగా రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 142 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టుల మంజూరుకు సహకరించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయనతోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వీటి ఏర్పాటుతో హుజూర్‌నగర్‌లో న్యాయస్థానాల సంఖ్య ఆరుకు చేరింది.
ఖైదీల ఆరోగ్యంపై
ప్రత్యేక శ్రద్ధవహించాలి
చివ్వెంల : ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శనివారం సూర్యాపేటలో సబ్ జైలును సందర్శించి మా ట్లాడారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఖైదీలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, భట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, జైలు సూపరింటెండెంట్ బి.సుధాకర్‌రెడ్డి, న్యాయవాదులు కట్ట సుధాకర్, బానోతు మంగునాయక్, భావ్‌సింగ్ పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, నిత్యకల్యాణం చేపట్టారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్‌చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
28న భగవద్గీత ప్రతిభా పోటీలు


