
తుంగతుర్తి ఏఓ సస్పెన్షన్
తుంగతుర్తి : తుంగతుర్తి వ్యవసాయ అధికారి (ఏఓ) బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. తన కింద పనిచేసే మహిళా ఏఈఓ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఏఓను శుక్రవారం విధుల నుంచి కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సస్పెండ్ చేశారు. ఈ విషయంపై విచారణ నిర్వహించి వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో మహిళా ఉద్యోగుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఉత్తర్వుల్లో హెచ్చరించారు.
డిప్యూటీ పోస్ట్ మాస్టర్‌కు ఉత్తమ అవార్డు
సూర్యాపేట : జిల్లా డిప్యూటీ పోస్ట్ మాస్టర్ బొజ్జ సునీల్ కుమార్‌కు ఉత్తమ అవార్డు దక్కింది. తెలంగాణ సర్కిల్ విభాగంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో జిల్లా నుంచి అత్యధికంగా పాలసీలు సేకరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపినందుకు ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రంతోపాటు షీల్డ్ బహుమానం స్వీకరించారు. పాలసీల సేకరణలో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన ఉత్తమ అవార్డు పొందిన సునీల్ కుమార్‌ను జిల్లా సూపరిటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్‌లతో పాటు ఈస్ట్, వెస్ట్ ఇన్‌స్పెక్టర్లు, పోస్ట్‌మాస్టర్ ఇతర పోస్టల్ సిబ్బంది అభినందించారు.
సీపీఎస్ విధానం రద్దుచేయాలి
సూర్యాపేటటౌన్ : కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలని ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1న తలపెట్టిన పాత పెన్షన్ సాధన పోరాట సభను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, సెక్రటరీ జనరల్ భూపాల్ రెడ్డి, అదనపు సెక్రటరీ జనరల్ తంగెళ్ల జితేందర్‌రెడ్డి, కోచైర్మన్ సోంబాబు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ దున్నా శ్యామ్, లక్కపాక ప్రవీణ్, పాండు నాయక్, గులాం జహంగీర్, బషీర్, ధరావత్ స్వప్న, పి.రజిత, పి.సంతోష తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో
కృష్ణమ్మకు హారతి
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద జీవనదిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి శుక్రవారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక హారతి పూజలు నిర్వహించారు. శ్రీస్వామి, అమ్మవార్లను ప్రత్యేక పల్లకీలో ఆలయం నుంచి సన్నాయి వాయిద్యాల నడుమ కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్‌కు తరలించారు. అనంతరం పసుపు కుంకుమ, చీర సారెతో ప్రత్యేకంగా హారతి పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిపి నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలుచెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

తుంగతుర్తి ఏఓ సస్పెన్షన్

తుంగతుర్తి ఏఓ సస్పెన్షన్