కోదాడలో నకిలీ వైద్యుల బెడద | - | Sakshi
Sakshi News home page

కోదాడలో నకిలీ వైద్యుల బెడద

Aug 31 2025 7:50 AM | Updated on Aug 31 2025 7:50 AM

కోదాడ

కోదాడలో నకిలీ వైద్యుల బెడద

అర్హత లేకుండా వైద్యం చేస్తే క్రిమినల్‌ కేసులు

బెయిల్‌పై వచ్చి మళ్లీ మరో చోట

కోదాడ: కోదాడలో నకిలీ వైద్యుల బెడద రోజురోజుకు ఎక్కువ అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, ఒక వేళ నకిలీలను గుర్తించినా చర్యలు తీసుకోకపోవడంతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో పోలీసు కేసులు నమోదు చేసినా వీరు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా శుక్రవారం అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడి ఆస్పత్రిని జిల్లా వైద్యశాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఈ హాస్పిటల్‌కు మూడునాలుగేళ్ల నుంచి అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్పా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఇలాంటి వైద్యశాలలు కోదాడలోనే మరో మూడు నాలుగు వరకు ఉన్నట్లు సమాచారం.

వైద్యుడి పేరుతో అనుమతి..

వైద్యం చేసేది మాత్రం నకిలీయే..

ఇతర దేశాలలో వైద్య విద్యను అభ్యసించిన వారు ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌ తప్పని సరిగా పాస్‌ కావాలి. ఆ తరువాతే వారికి వైద్యం చేసే అర్హత వస్తుంది. కానీ పలువురు కఠినంగా ఉండే ఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌ పాస్‌ కావడం లేదు. వీరు తెలివిగా ఇండియాలో చదివిన వైద్యుడి సర్టిఫికెట్లతో వైద్యశాలలకు అనుమతులు తీసుకుంటున్నారు. ఆ తరువాత వీరు రంగంలోకి దిగి అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన సమయంలో జిల్లా వైద్యశాఖ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్పా చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్‌ రోడ్డులో మరో ముగ్గురు నకిలీ వైద్యులు క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మెడికల్‌ షాపులే క్లినిక్‌లుగా..

కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్‌ రోడ్డులో ఉన్న పలు మెడికల్‌ షాపుల యజమానులు వారంలో రెండు మూడు రోజులు తమ దుకాణాలను క్లినిక్‌లుగా మారుస్తున్నారు. టెంట్లు వేసి జాతరను తలపించే విధంగా ఈ దందా సాగుతోంది. స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పేర్లతో ఇక్కడ జరిగే దోపిడీకి అంతే లేదు. వచ్చిన వైద్యుడు అసలా.. నకిలీయా.. అతనా.. కాదా అన్నది చూడడంలేదు. సీనియర్‌ డాక్టర్ల పేరు చెప్పి జూనియర్లతో వైద్యం చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. మూడు సంవత్సరాల క్రితం హుజూర్‌నగర్‌ రోడ్డులో ఓ మెడికల్‌ షాపు యజమాని స్కిన్‌ స్పెషలిస్ట్‌ స్థానంలో కోదాడకు చెందిన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని కూర్చోబెట్టి వైద్యం చేయిస్తుండగా ఓ పేషంట్‌ గుర్తుపట్టి నిలదీయగా అతను పారిపోయాడు. నాడు ఈ షాపును అధికారులు సీజ్‌ చేశారు. నెల తిరగక ముందే మళ్లీ అనుమతులు ఇచ్చారు. తాజాగా మళ్లీ అక్కడ ఈ దందా సాగుతూనే ఉంది.

అర్హత లేకుండా వైద్యశాలలు నిర్వహించినా, వైద్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తాం. ఫిర్యాదులు రావడంలో శుక్రవారం కోదాడలో ఓ వైద్యశాలను సీజ్‌ చేశాం. నకిలీ వైద్యులపై సరైన సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చినవారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.

–చంద్రశేఖర్‌, జిల్లా వైద్యశాఖాధికారి

కేసులు నమోదు చేస్తున్నా బెదరని నకిలీలు

ఫ ఇప్పటికే మూడు క్లినిక్‌లు సీజ్‌

ఫ వైద్యుడి పేర అనుమతులు.. అనర్హుడితో వైద్య సేవలు

ఫ రోగుల ప్రాణాలతో చెలగాటం

ఫ అధికారుల పర్యవేక్షణలోపం

ఇది.. కోదాడలో శ్రీహృదయ వైద్యశాల. దీన్ని నిర్వహిస్తున్నది వన్నా యశ్వంత్‌ కుమార్‌. ఎం.బి.బిఎస్‌. డీఎన్‌బీ చేసినట్లు బోర్డుపై రాసుకొని కోదాడలో వైద్యం చేస్తున్నాడు. ఇతను ఒక దగ్గర అనుమతి తీసుకొని వేరొక చోట వైద్యం చేస్తున్నాడని అధికారులు నోటీసులు ఇచ్చారు. అతనిపై ఫిర్యాదులు తరచూ రావడంతో వైద్యశాలను తనిఖీ చేయడంతో పాటు అతని వైద్యడిగ్రీపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా నకిలీదని తేలింది. ఇతడు తన పేరును పోలిన ఒక వైద్యుడి సర్టిఫికెట్లను ఎంసీఐ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి అవి తన సర్టిఫికెట్లగా నమ్మిస్తూ వైద్యశాలకు అనుమతులు పొంది వైద్యం చేస్తున్నాడు. అతను చూపుతున్న సర్టిఫికెట్లు కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో గల శ్రీదేవరాజ్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన యశ్వంత్‌కుమార్‌ తండ్రి రవికుమార్‌విగా అధికారులు గుర్తించారు. కోదాడలో వైద్యం చేస్తున్న యశ్వంత్‌కుమార్‌ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చేసి ఇండియాలో మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌ పాస్‌ కాలేదు. కానీ నకిలీ సర్టిఫికెట్లతో మూడేళ్లుగా కోదాడలో వైద్యశాల నిర్వహించాడు. ఇతనిపై అధికారులు కేసులు నమోదు చేయగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంటనే బెయిల్‌పై వచ్చి ప్రస్తుతం మరోచోట వైద్యం చేస్తున్నట్లు సమాచారం.

కోదాడలో నకిలీ వైద్యుల బెడద1
1/1

కోదాడలో నకిలీ వైద్యుల బెడద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement