
సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత
నాగార్జునసాగర్ : ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో సాగర్ క్రస్ట్ గేట్లను మంగళవారం రాత్రి మూసివేశారు. ఎగువన గల శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనతో కేవలం 51,635 క్యూసెక్కులు మాత్రమే సాగర్‌లోకి నీరు వస్తోంది. దీంతో అంతే నీటిని నాగార్జునసాగర్ నుంచి విద్యుత్ ఉత్పాదన, ఆయకట్టు అవసరాలకు విడుదల చేస్తున్నారు.
పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిది
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిదని తెలంగాణ క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో దీపక్‌జాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు, రుణ సౌకర్యాలు, శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్, పాస్టర్స్, క్రైస్తవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనం రూ. 20వేలు ఇవ్వాలి
సూర్యాపేట : ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.20వేలు ఇవ్వాలని బీఆర్‌టీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంపటి గురూజీ కోరారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ హాస్పిటల్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు రూ.18వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయలేదన్నారు. అనంతరం వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ సూర్యాపేట పట్టణ అధ్యక్షురాలు జి. సక్కుబాయి, నాగలక్ష్మి, వెంకటరమణ, ఉమ, విజయలక్ష్మి, రెహానా, పర్వీన్, మరియమ్మ, బైనాబాయి, నవ్య, వసంత, కవిత, బుజ్జి, నాగపూర్ణిమ, ఉమా, నాగమణి, సైదమ్మ, రజిత, సునీత, శైలజ, పారిజాత, భవాని పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం విశేష పూజలు చేశారు. ఈసందర్భంగా అర్చకులు ఆలయ ముఖమండపంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలో శ్రీ మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామా చార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత