
నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులూ కలగవద్దు
భానుపురి (సూర్యాపేట) : వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. వినాయక నిమజ్జనంపై జిల్లా, డివిజన్ అధికారులతో మంగళవారం వెబెక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినాయక నిమజ్జనాలు జరిగే సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో ఆర్డీఓల కార్యాచరణ ప్రణాళికలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరూ నీళ్లలో పడిపోకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైనంత వెలుతురు ఉండేలా లైటింగ్, హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్కులు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రూట్ మ్యాప్ తయారు చేయాలి
సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు, రత్నాపురం, కోదాడలో పెద్ద చెరువు, మఠంపల్లి, చింతలపాలెం ఘాట్లు, నేరేడుచర్ల, పాలకవీడు ఘాట్ల వద్ద నిమజ్జనం జరిగే అవకాశం ఉందని ఆర్డీఓలు కలెక్టర్‌కు చెప్పారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో నిమజ్జనానికి వినాయక విగ్రహాలు వస్తాయని వారు వివరించారు. ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఆయా శాఖలు జాగ్రత్తగా ఉండాలని, తక్షణమే రూట్ మ్యాప్ తయారుచేసి తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
సమన్వయంతో పనిచేయాలి
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎస్పీ నరసింహ కోరారు. రహదారులపై గుంతలను పూడ్చివేయాలని ఆదేశించారు. అనంతరం సద్దల చెరువును మున్సిపల్, పోలీస్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, భానుపురి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అనంతుల కృపాకర్, ప్రధాన కార్యదర్శి రుక్మారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లమల్ల నర్సింహ, బైరు వెంకన్న, కారింగుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్