
భర్తీ జాప్యం.. పని భారం!
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే..
నాగారం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీల పాత్ర ఎంతో కీలకం. అలాంటి అంగన్‌వాడీ కేంద్రాల్లో నాలుగేళ్లుగా ఖాళీ పోస్టులు భర్తీకావడం లేదు. టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీలు ఉన్నచోట ఇద్దరి పని ఒక్కరే చేస్తుండడంతో వారిపై పనిభారం పెరిగింది. పైగా గ్రామీణులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడం ఇబ్బందిగా మారుతోందని టీచర్లు, ఆయాలు వాపోతున్నారు. జిల్లాలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 83 టీచర్లు, 287 ఆయాలతో కలిపి మొత్తం 370 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో టీచర్‌తోపాటు ఆయా ఇద్దరూ లేకపోవడంతో సమీప కేంద్రాల్లోని వారు సేవలు అందిస్తున్నారు. దీంతో పిల్లల శారీరక వికాసం వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. ఆయాలు లేని కేంద్రాల్లో భోజనం తయారు చేయడం ఇబ్బందిగా ఉంటే టీచర్లు లేనిచోట పిల్ల లకు ఆయాలు అక్షరాలు నేర్పించలేని పరిస్థితి నెలకొంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి మూడు నెలల క్రితం ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
ఆశావహుల ఎదురుచూపు..
అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీచేస్తారని గ్రామీణ నిరుద్యోగ మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైతే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఖాళీల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చింది. ఆయాలు, టీచర్ల పోస్టులకు ఇంటర్ పూర్తిచేసి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉన్న మహిళలు దరఖాస్తులు చేసుకునే విధంగా నిబంధన తెచ్చింది. కానీ జిల్లాలో ఖాళీ పోస్టులను ఎప్పుడు భర్తీచేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, ఆయాల పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయగానే ఖాళీలను భర్తీ చేస్తాం.
– దయానందరాణి,
జిల్లా సంక్షేమశాఖ అధికారి
అంగన్‌వాడీల్లో 370 పోస్టులు ఖాళీ
భర్తీ కోసం మూడునెలల క్రితం
మార్గదర్శకాలు జారీ
నేటికీ అధికారికంగావెలువడని ప్రకటన