
కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వానిది దుష్ప్రచారం
రామగిరి(నల్లగొండ): కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల కింద వచ్చిన కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు. అబద్దాలు మాట్లాడి ప్రతిపక్షాలపై దుష్ప్రచారాలు చేయొద్దని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన వైనాన్ని ఎండగతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మూడు నెలల గడువు ఇస్తే రెండు నెలలుగా ప్రభుత్వం నిద్రపోయిందన్నారు. ఒక వైపు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎన్నికల సంఘం హడావుడిగా ఓటరు లిస్టు ప్రదర్శించడం దుర్మార్గమన్నారు. ఓటర్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని ప్రజలంతా లిస్టును చూసుకునేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాపై ఇక్కడి మంత్రులకు పట్టింపు లేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి