
ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాం
నల్లగొండ టూటౌన్: ఎన్‌సీసీ శిక్షణ తరగతుల్లో క్రమశిక్షణ, దేశభక్తి సమ్మిళితమైన ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తామని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్‌సీసీ క్యాడేట్ల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీలో ప్రవేశానికి 60 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వారిలో ఎత్తు, బరువు, ఆరోగ్యం, రాత పరీక్షల ఆధారంగా ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థులకు ఎన్‌సీసీ ద్వారా నేషనల్ డిపెన్స్ అకాడమీ, అగ్నివీర్ లాంటి పథకాల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ ఇన్‌చార్జి డాక్టర్ మశ్చేందర్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్.సుధారాణి, కొమ్ము మల్లయ్య, చంద్రవీర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
చివ్వెంల(సూర్యాపేట): కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీకాంత్‌పై కొందరు దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.