
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ ఆ పాఠశాలలో ఏడేళ్లుగా పనిచేస్తూ విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆమె ఇప్పుడు బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ మీద మోతె మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు.
వనజ మంగళవారం పాఠశాల నుంచి రిలీవ్ అవుతుండగా.. విద్యార్థులు ఆమెను చుట్టుముట్టి ‘మా మేడమ్ మాకే కావాలి. మేడమ్ మీరు వెళ్లొద్దు’ అంటూ రోదించారు. విద్యార్థులు రోదించడంతో టీచర్ (Teacher) వనజ వారిని చూసి కన్నీరుపెట్టుకున్నారు.
‘వలస కూలీ’పై ప్రత్యేక బోధన
మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కొత్తపల్లి ప్రభాకర్ వినూత్నంగా పాఠాలు బోధిస్తుంటారు. పాఠ్యాంశంలోని పాత్రలను స్వయంగా జరిగే ప్రాంతానికి గానీ, లేదా స్వయంగా విద్యార్థులకు వేషధారణ చేసి వారు స్వీయ అవగాహన చేసుకునేలా బోధిస్తారు.

అందులో భాగంగా మంగళవారం పాఠశాలలో 9వ తరగతి తెలుగు సబ్జెక్టులోని ‘వలస కూలీ’ పాఠాన్ని.. విద్యార్థికి వలస కూలీ వేషం వేసి పాత్ర సన్నివేశాల ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులు (Students) ఇలా నేర్చుకోవడం వల్ల ఆ పాఠాన్ని ఎప్పటికీ మరిచిపోరని ఉపాధ్యాయుడు ప్రభాకర్ చెప్పారు.
బాల్యం ఆటలోనే బందీ
వారిది పలకాబలపం పట్టుకొని బడి బాట పట్టాల్సిన బాల్యం. కానీ.. తల్లిదండ్రుల పేదరికమో.. విద్యా అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆటపాటలతోనే భవిష్యత్‌ను బందీ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పని చేసే ఫ్యాక్టరీ ఎదుట కొందరు బోరింగ్ పంపునకు ఊయల కట్టుకొని, మరికొందరు మట్టిలోనే గడుపుతున్నారు.

ప్రభుత్వం చేపట్టిన బడిబాట, చదువుకు దూరంగా ఉన్న పిల్లలకోసం ముస్కాన్ (Muskaan) లాంటి కార్యక్రమాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అవి ప్రకటనలకే పరిమితమయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
చదవండి: మంచిర్యాల యువకుడికి 4 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 లక్షల ప్యాకేజీతో మరో జాబ్