
కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలి
కోదాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పకొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు కోరారు. మంగళవారం కోదాడలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చిందని, వీటి వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, రాధాకృష్ణ, శ్రీలం శ్రీను, చెరుకు ఏకలక్ష్మి, సోమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు