
విజయానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముఖ్యం
సూర్యాపేటటౌన్ : జీవితంలో విజయం సాధించడానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముఖ్యమనికలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా చదువు, ఇతర అంశాలపై వారి అభిప్రాయాలు, తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని గమ్యం చేరేవరకు కష్టపడి చదువుకోవాలన్నారు. తరగతి గదుల్లో లైటింగ్స్, ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్, బాత్ రూమ్ లు వేరు వేరుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ నాయక్, ఆర్‌సీఓ స్వప్న, డీసీఓ స్వప్న, హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు.