
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీప్ కౌసర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు గిరిజన హక్కులు– అమలుపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు, రాజ్యాంగం గిరిజనులకు కల్పిస్తున్న హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ప్రిన్సిపాల్ శ్రీవాణి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, గుంటూరు మధు, న్యాయవాదులు తల్లమల్ల హస్సేన్, ఎడిండ్ల అశోక్, దావుల వీర ప్రసాద్, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : 2025 – 26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో ఐకేపీ, సహకార, మార్కెటింగ్ మెప్మా శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ శాఖల పరిధిలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీఎస్‌ఓ మోహన్‌బాబు, డీసీఓ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పులిచింతలకు 3,70,063
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. ప్రాజెక్టుకు 3,70,063 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. 11గేట్లను నాలుగున్నర మీటర్ల మేర ఎత్తి 3,58,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయం
నాగారం : ఉద్యాన పంటలను సాగుచేసి రైతులు అధిక ఆదాయం పొందాలని తుంగతుర్తి డివిజన్ ప్రాంతీయ ఉద్యాన శాఖ అధికారిణి ప్రమిత అన్నారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలో ఉద్యాన పంటలను ఆమె సందర్శించి మాట్లాడారు. అధిక ఆదాయాన్ని ఇచ్చే పండ్లు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన శాఖలో వివిధ పథకాలకు సంబంధించి 2025–26 వార్షిక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. ఆయిల్ పామ్ విస్తరణ, సమగ్ర ఉద్యాన అభివృద్ధి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మ నీటి పారుదల పథకం, వెదురు మిషన్ వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునే రైతులు ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ ఏరియా మేనేజర్ శశికుమార్, ఉద్యాన విస్తరణ అధికారి ముత్యంరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి

విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి