అత్యవసర మరమ్మతులు
సాగర్ ఎడమ కాల్వ కట్టను పటిష్ట పరిచేలా పనులు
ఫ రూ.1.26 కోట్లు మంజూరు
చేసిన ప్రభుత్వం
ఫ నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న మట్టి పనులు
ఫ త్వరలో కంపచెట్ల తొలగింపు
ఫ టెండర్ల ప్రక్రియలో తూములకు
కొత్త షెట్టర్ల ఏర్పాటు
నడిగూడెం : జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకట్టను పటిష్టం చేపట్టేందుకు అధికారులు అత్యవసర మరమ్మతులు మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా ఎడమ కాల్వకట్ట మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో పలుచోట్ల కాల్వకట్ట బలహీనంగా మారింది. ఇరువైపులా కంపచెట్లు పెరిగి లైనింగ్‌తోపాటు తూముల షెట్టర్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఎక్కడ.. ఎప్పుడు కాల్వకట్ట తెగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్వకట్టకు అత్యవసర మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1.26కోట్ల నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.
రూ.12 లక్షల నిధులతో కాల్వకట్ట
మరమ్మతులు
నడిగూడెం మండలం రామాపురం 120 కిలోమీటరు వద్ద చెరువు వెంట ఉన్న సాగర్ ఎడమ కాల్వకట్ట ఇప్పటి వరకు రెండుసార్లు కుంగింది. దీంతో కాల్వకట్ట కూడా దెబ్బతిని బుంగలు పడి కట్ట ప్రమాదకరంగా మారింది. దీంతో కాల్వకట్ట అత్యవసర మరమ్మతులకు ప్రభుత్వం రూ.12 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో కాల్వకట్ట చౌడుమట్టితో ఉన్న చోట్లలో ఆ మట్టిని పూర్తిగా తొలగించి కొత్త మట్టితో పటిష్టం చేస్తున్నారు. పనులు జరుగుతున్న క్రమంలో చాకిరాల నుంచి కృష్ణానగర్ వరకు ఈ కట్టపై రాకపోకలను నిలిపివేశారు. 10 రోజుల్లో కాల్వకట్ట మరమ్మతు పనులు పూర్తికానున్నాయి.
కంపచెట్లు తొలగింపునకు..
మునగాల మండల కేంద్రం సమీపం నుంచి సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ 115 కిలోమీటర్ నుంచి నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం 133 కిలోమీటర్ వద్దగల రంగుల వంతెన వరకు కాల్వ కట్టకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లను తొలగించేందుకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు చేపట్టనున్నారు.
కొత్త షెట్టర్లు ఏర్పాటు చేసేలా..
పెన్‌పహాడ్ మండలం దోసపాడు 74వ కిలోమీటర్ నుంచి నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం రంగుల వంతెన 133 కిలోమీటర్ వరకు సాగర్ ఎడమ కాల్వ కట్టపై ఉన్న 24 మేజరు కాల్వల తూములకు ఉన్న తుప్పు పట్టిన పాత షెట్టర్లను తొలగించి కొత్త షెట్టర్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.99 లక్షలు మంజూరు చేసింది. ఇందుకు టెండర్లు స్వీకరించాల్సిఉంది.
మట్టి పనులు కొనసాగుతున్నాయి
కాల్వకట్టను పటిష్టం చేసేందుకుగాను నాలుగు రోజుల నుంచి మట్టి పనులు కొనసాగుతున్నాయి. కంపచెట్ల తొలగింపు పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. తూములకు కొత్త షెట్టర్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ దశలో ఉంది. తూములకు కొత్త షెట్టర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మేజర్ కాల్వలకు కేటాయించిన కేపాసిటీ మేరకు నీటి విడుదల జరుగుతుంది.
– సత్యనారాయణ,
సాగర్ ఎడమ కాల్వ ఏఈ


