పచ్చిరొట్ట.. పైరుకు బలం
గుర్రంపోడు: వచ్చే వానాకాలం సీజన్‌లో ప్రధాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగను పొలాల్లో సాగు చేసుకుని భూమిలో కర్బన సేంద్రియం పెంచుకోవాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల వలన కలిగే ప్రయోజనాలు ఆయన మాటల్లోనే..
● పచ్చిరొట్ట సాగుకు
ఇదే అనువైన సమయం
సాధారణంగా వానాకాలం తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకుని పూత దశలో కలియదున్నడం వల్ల సేంద్రియ ఎరువులా పనిచేసి ప్రధాన పంటకు బలానిస్తుంది. భూమిలో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మూడు శాతం పైగా సేంద్రియ కర్బనం ఉండగా, మన దేశంలో ఒక్క శాతానికి మించి ఉండటం లేదు. ఏదో ఒక రకంగా భూమిలో సేంద్రియ కర్బనం పెంచేందుకు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకోవాలి. మే రెండో పక్షం నుంచి నుంచి జులై రెండో పక్షం వరకు రైతులు ఏ పంటలు వేయరు కాబట్టి ఇటువంటి సమయంలో పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర లాంటి పంటలు సాగు చేసుకుంటే ఎకరాకు పది టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఈ పంటలు పూత దశలో నేలలో కలియదున్నడం ద్వారా ఎకరాకు 25 నుంచి 35 కిలోల నత్రజని, ఐదు కిలోల పొటాష్ లభ్యమవుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు జనుము, జీలుగ సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ రాయితీపై జనుము, జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తుంది. జీలుగ విత్తనాలను వ్యవసాయశాఖ రాయితీపై 30 కిలోల బస్తా రూ.2137కు, జనుము 40 కేజీల బస్తా రూ.2510కు పంపిణీ చేస్తోంది.
● మాగాణుల్లో..
మాగాణి భూములు జీలుగ సాగు చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. దుక్కిని బాగా దున్నుకుని ఎకరాకు 20 కిలోల జీలుగ విత్తనాలు వేసుకోవాలి. పూత దశలో కలియదన్నడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. వరి నాటు వేసే నాటికి జీలుగ కలియదున్నడం వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. 45 రోజులు మించకుండా జీలుగను నీళ్లు పెట్టి కలియదున్నాలి.
పండ్ల తోటల్లో ..
పండ్ల తోటల్లో జనుము పంట సాగు చేసుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పండ్ల మొక్కలు కాపునకు వచ్చేంత వరకు అంతరంగా జనుమును సాగు చేసి పూత వచ్చే సమయంలో కలియదున్నాలి. ఎకరాకు 15 కిలోల జనుము విత్తనాలు సరిపోతాయి. పండ్ల తోటలు ఏపుగా ఎదగడానికి పచ్చిరొట్ట ఎరువు ఎంతగానో దోహదపడుతుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి పండ్ల మొక్కలు తెగుళ్ల బారిన పడకుంగా ఉంటాయి. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల జరిగే నష్టాన్ని పచ్చిరొట్ట ఎరువు ద్వారా తక్కువ ఖర్చుతో భర్తీ చేయవచ్చు. పండ్ల తోటల్లో జనుము సాగు వల్ల కలుపు మొక్కల సమస్య ఉండదు. పచ్చిరొట్టను పండ్ల తోటల పాదుల్లో వేసి మట్టితో కప్పి వేయాలి. పచ్చిరొట్ట ఎరువుగానే కాకుండా పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది.
పచ్చిరొట్ట.. పైరుకు బలం


