మామిడి రైతు కుదేలు
పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి
కౌలు మందం కూడా వచ్చేలా లేదు
నలభై ఎకరాల మామిడి తోటను రూ.12 లక్షలకు కౌలుకు తీసుకున్నాను. రూ.8 లక్షల పెట్టుబడి పెట్టాను. ఈ సారి దిగుబడి తగ్గింది. దీనికితోడు గాలి దుమారానికి చాలా కాయలు రాలాయి. ఇప్పటివరకు రూ.5లక్షల కాయలు అమ్మాను. ఉన్న దిగుబడిని చూస్తే కౌలు కూడా పూడేటట్టు లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– నేలమర్రి శ్రీను, రామాపురం,
నడిగూడెం మండలం
మార్కెట్‌కు కాయలు
తీసుకెళ్తే తిరిగి తేలేం..
చెట్ల నుంచి తెంపిన కాయలను వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మాల్సిందే. ధర తక్కువగా ఉందని నిల్వ ఉంచుకోలేము. అలాగని మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి తీసుకురాలేము. ఇవన్నీ తెలుసు కాబట్టే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ధర తగ్గించి కొనుగోలు చేస్తూ నిలువునా ముంచుతున్నారు.
– బండమీది ఎల్లయ్య,
కౌలు రైతు, ఆత్మకూర్(ఎస్)
ప్రభుత్వం ఆదుకోవాలి
మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు అనువైన మార్కెట్, గిట్టుబాటు ధరలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉద్యానవన రైతులు బతికి బట్ట కట్టలేని పరిస్థితి నెలకొంది. ఈదురు గాలులకు మామిడికాయలు రాలిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– అర్వపల్లి తిరుపతయ్య, కౌలు రైతు నసీంపేట, ఆత్మకూర్(ఎస్) మండలం
సూర్యాపేట అర్బన్ : ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో మామిడి తోటలు పూత బాగా పూసినా తేనెమంచు, చీడపీడల బెడదతో దిగుబడి తగ్గిపోయింది. గత సీజన్‌లో కంటే మామిడి ధర పెరిగినప్పటికీ ఈసారి పెట్టుబడులు కూడా అధికం కావడంతో అందుకు అనుగుణంగా మార్కెట్‌లో ధర అందడం లేదని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డు నుంచి హైవేకు ఇరువైపులా కొత్త బస్టాండ్ వరకు గల మామిడి మార్కెట్‌కు రైతులు రోజుకు సుమారు 200 టన్నుల మామిడి కాయలు తీసుకొస్తారు. కమీషన్ ఏజెంట్ల ద్వారా వ్యాపారుల కు విక్రయిస్తుంటా రు. వాటిని కొన్నవారు మ హారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు అధిక ధరకు ఎగుమతి చేస్తారు.
తూకంలో భారీగా కోత!
మార్కెట్‌లో వ్యాపారులు ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత మళ్లీ మార్చొద్దు కానీ కాంటా అయ్యాక లోపల కొంతకాయ పాడైపోయిందని ధరలు తగ్గిస్తూ.. తూకంలో కోత విధిస్తున్నారు. సూట్ పేరిట టన్నుకు క్వింటా కోత పెడుతూ 6 నుంచి 8 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. దీంతో రూ.వందకు రూ.10 నుంచి రూ.15 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో చిన్నకాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే తక్కువ ధర చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.
ప్రైవేట్ మార్కెట్లే దిక్కు
ఈ సీజన్‌లో మామిడి దిగుబడి తగ్గడంతో ఏ రైతు కూడా జిల్లాకు సుమారు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న బాటసింగారంలోని జాతీయ పండ్ల మార్కెట్‌కు తరలించలేని పరిస్థితి. దీంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు మార్కెట్లలోనే అమ్ముకుంటున్నారు. వాస్తవానికి దిగుబడి తగ్గినప్పుడు ధర పెరగాలి కానీ వ్యాపారుల ధరలు తగ్గించి కొంటున్నారు. బంగినపల్లి మామిడి ఎంత క్వాలిటీగా, పెద్ద సైజులో ఉన్నా టన్నుకు రూ.40 వేలకు మించడం లేదని రైతులు అంటున్నారు. గతేడాది మొదటి రకం మామిడి టన్ను ధర రూ.రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంది. అయితే ప్రస్తుతం సీజన్‌లో రూ.35వేల నుంచి రూ.40 వేల వరకు పెరిగింది. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా ధర రావడంలేదని, ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు.
ఫ తూకంలో కోత విధిస్తున్న వ్యాపారులు
ఫ టన్నుకు 8శాతం వరకు కమీషన్ వసూలు
ఫ కరువైన అధికారుల పర్యవేక్షణ
ధరలు ఇలా (టన్నుకు రూ.వేలల్లో..)
కొనుగోళ్లు ప్రారంభంలో 60
ప్రస్తుతం (నాణ్యమైన కాయ) 40
మధ్యస్థంగా ఉన్న కాయ 25
రాలిపడి మచ్చలు ఉన్న కాయ 10
మామిడి రైతు కుదేలు
మామిడి రైతు కుదేలు


