ఆటలు నేర్చుకుందామా..
హుజూర్‌నగర్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, యువజన క్రీడా సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో మే 1 నుంచి జూన్ 6 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల్లో అర్హులైన వారిని శిక్షకులు (కోచ్‌లు)గా ఎంపిక చేశారు. వీరి ఆధ్వర్యంలో చిన్నారులకు ఈ వేసవిలో నెల రోజుల పాటు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
క్రీడాకారుల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు
శిబిరాలకు వచ్చే విద్యార్థుల వివరాలు గతంలో శిక్షకుల వద్ద నమోదు చేసుకునే వారు. వీరికి ప్రత్యేక హాజరు రిజిస్టర్ నిర్వహించేవారు. అయితే ఈఏడాది నుంచి క్రీడాకారుల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. మే 5వ తేదీ లోపల ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇటీవల శిక్షకులకు అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరాల్లో ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించిన క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తారు. అంతే కాకుండా వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు ఎంపిక చేసే అవకాశం కూడా ఉంటుంది.
దాతలు సహకారం అందిస్తే
మరింత ప్రయోజనం
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్థానికంగా ఉండే దాతలు స్పందించి తమవంతు సహాయ సహకారలు అందిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. నెల రోజుల పాటు జరిగే శిబిరంలో వారానికి ఒకసారి పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలి. క్రీడాకారులకు క్రీడా పరికరాలు, ప్రత్యేక క్రీడాదుస్తులు సమకూరిస్తే మరింత మంది చిన్నారులు, యువకులు ఎక్కువగా మైదానాల బాట పట్టే అవకాశం ఉంటుంది.
జిల్లాలో 14చోట్ల శిక్షణ శిబిరాలు
ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లో 10 చోట్ల, పట్టణ ప్రాంతాల్లో 4 చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. వాటిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలైన తుంగతుర్తి మండలం వెంపటి, చిలుకూరు, నడిగూడెంలలో కబడ్డీ శిక్షణ శిబిరాలు, కోదాడ మండలం కూచిపూడి, సూర్యాపేట మండలం యడ్లపల్లిలో ఖోఖో, కోదాడ మండలం కొమరబండ, గుడిబండ, చిలుకూరు మండలం పాలెఅన్నారం, మేళ్లచెరువు, అర్వపల్లిలో వాలీబాల్ క్రీడల శిక్షణ శిబిరాలు నిర్వహించ నున్నారు. పట్టణ ప్రాంతాలైన సూర్యాపేట పరిధిలోని పిల్లలమర్రిలో అథ్లెటిక్స్, టేకుమట్లలో బాస్కెట్‌బాల్, కోదాడ పరిధిలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో బాస్కెట్‌బాల్, కొమరబండలో వాలీబాల్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 14 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులు. వారికి రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఆయా క్రీడల్లో శిక్షణ ఉంటుంది. ఇప్పటికే ఆయా చోట్ల క్రీడా మైదానాలు సిద్ధమయ్యాయి.
నేటి నుంచి జూన్ 6వరకు విద్యార్థులకు వేసవి క్రీడల శిక్షణ
ఫ జిల్లాలో 14 చోట్ల శిబిరాలు
ఫ 14ఏళ్లలోపు బాలబాలికలకు అవకాశం
నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
శిబిరాల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. సంబంధిత క్రీడాంశాలకు సంబంధించిన సామగ్రిని అందిస్తాం. శిబిరాల్లో తాగునీటి వసతి, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచుతాం. గ్రామీణ క్రీడాకారులు శిబిరాలను సద్వినియోగం చేసుకొని క్రీడా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. ఆయా క్రీడల్లో మరింతగా రాణించాలి
–జి రాంచందర్‌రావు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి, సూర్యాపేట
ఆటలు నేర్చుకుందామా..


