కంది పంటకు డ్రోన్‌తో పురుగుల మందు పిచికారీ | - | Sakshi
Sakshi News home page

కంది పంటకు డ్రోన్‌తో పురుగుల మందు పిచికారీ

Dec 19 2023 1:32 AM | Updated on Dec 19 2023 1:32 AM

నాగారంలో కంది పంటకు మందు 
పిచికారీ చేస్తున్న డ్రోన్‌ - Sakshi

నాగారంలో కంది పంటకు మందు పిచికారీ చేస్తున్న డ్రోన్‌

నాగారం : రోజు, రోజుకు వ్యవసాయంలో ఆధునికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటికే ఆధునిక యంత్రాలు రావడంతో వ్యవసాయంలో పలు మార్పులు చోటు చేసుకోగా తాజా డ్రోన్‌ యంత్రాల రాకతో రైతులకు తక్కువ ఖర్చుతో పాటు, సమయంలో ఆదా అవుతుంది. నాగారం మండల కేంద్రానికి చెందిన రైతు కన్నెబోయిన వెంకన్న సోమవారం తాను సాగు చేసిన రెండు ఎకరాల కంది పంటకు డ్రోన్‌ సహాయంతో పురుగుల మందు పిచికారీ చేయించాడు. డ్రోన్‌తో కేవలం 10నిమిషాల సమయంలో ఎకరం కంది చేనుకు పురుగుల మందు పిచాకారీ పూర్తయ్యింది. కూలీలతో కంది పంటకు మందును పిచికారీ చేయిస్తే ఎకరాకు రూ.1000 వరకు ఖర్చవుతుందని, డ్రోన్‌ యంత్రం సహాయంతో రూ.500 ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదావుతుందని రైతు పేర్కొన్నాడు.

చెట్టు పైనుంచి కిందపడి విద్యార్థికి గాయాలు

మోతె : చెట్టు పైనుంచి కిందపడడంతో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన మోతె మండల పరిధిలో రాఘవాపురం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. రాఘవాపురం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నిమ్మల శ్రీనివాస్‌ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థి భాను కౌశిక్‌ను కరివేపాకు తీసుకరమ్మని కోరాడు. దీంతో భాను కౌశిక్‌ చెట్టు ఎక్కి కరివేపాకు తెంపుతుండగా జారి కిందపడడంతో గాయాలయ్యాయి. విద్యార్థులను సొంత పనులకు వినియోగించిన ఉపాధ్యాయుడు నిమ్మల శ్రీనివాస్‌ను వెంటనే విధుల నుంచి తొలగించి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను గ్రామస్తులు కోరారు.

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పలువురికి గాయాలు

యాదగిరిగుట్ట రూరల్‌: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీ కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరిగుట్ట మండల పరిధిలోని పెద్దకందుకూరు గ్రామం స్టేజీ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వరంగల్‌ డిపో–1 కి చెందిన ఆర్టీసీ బస్సు సుమారుగా 40 మంది ప్రయాణికులతో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తోంది. మార్గమధ్యలో మండలంలోని పెద్దకందుకూరు స్టేజీ సమీపంలో రోడ్డు క్రాస్‌ చేస్తున్న బైక్‌ను తప్పించబోయి అదే రూట్లో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఆలేరులోని ఏరి యా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.

చెట్టును ఢీకొట్టిన కారు.. ఏడుగురికి గాయాలు

నాంపల్లి : అతివేగంతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాంపల్లి మండల పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11మంది సోమవారం మధ్యాహ్నం కారులో హాలియా వెళ్లారు. అక్కడ బంధువుల వివాహ రిసెప్షన్‌లో పాల్గొని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మండలంలోని మహ్మదాపురం గ్రామ శివారు మూలమలుపులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement