
మాట్లాడుతున్న పోలీసు పరిశీలకుడు ఫర్హత్ అబ్బాస్, చిత్రంలో ఎస్పీ రాహుల్ హెగ్డే
సూర్యాపేట క్రైం: ఎన్నికల విధుల నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు పరిశీలకుడు, వెస్ట్‌బెంగాల్ క్యాడర్ డీఐజీ ఫర్హత్ అబ్బాస్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు అధికారుల సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను, రక్షణ ప్రణాళికను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రానున్న 16 రోజులు చాలా ముఖ్యమైనవని, సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పని చేయాలన్నారు. ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గల గ్రామాల్లో నిఘా కట్టుదిట్టం చేయాలన్నారు. చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీలు చేస్తూనే ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాలను అడ్డుకోవాలని తెలిపారు. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విధుల నిర్వహణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య పృష్టించే ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి ఎన్నికల నియమావళి పట్ల అవగాహన కల్పించి మళ్లీ నేరాలకు పాల్పడకుండా ముందస్తు బైండోవర్ చేయాలని సూచించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. అధికారుల మధ్య సమాచార, సమన్వయ లోపం లేకుండా పని చేస్తామన్నారు. తనిఖీల్లో రూ.2 కోట్ల99లక్షలు, రూ.17లక్షల 29 వేల విలువగల 3,511 లీటర్ల మద్యం, సారా తయారీ బెల్లం, పట్టిక, రూ.1 కోటి 29 లక్షల విలువగల 283 గ్రాముల బంగారం, 140 కేజీల సిల్వర్, రూ. 1 కోటి 6 లక్షల విలువగల ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, రూ.50 లక్షల విలువగల గంజాయి సీజ్ చేసినట్లు చెప్పారు. 143 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు నాగభూషణం, ప్రకాష్, రవి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్, ఎలక్షన్ సెల్ ఇన్‌స్పెక్టర్ మహేష్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
ఫ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
ఫ ప్రశాంత ఎన్నికలకు కృషి చేయాలి
ఫ అధికారుల సమీక్షా సమావేశంలో
పోలీసు పరిశీలకుడు ఫర్హత్ అబ్బాస్