ఆదిత్యుని సన్నిధిలో నటుడు అభిరామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో నటుడు అభిరామ్‌

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

అరసవల్లి: సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ యాజమాన్య ప్రతినిధి, ప్రముఖ సినీ నటుడు దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్‌ తొలిసారి అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. స్థానిక కిన్నెర యూనిట్‌ మేనేజర్‌ వరప్రసాద్‌తో కలిసి ఆయన అరసవల్లి చేరుకుని అంతరాలయం దర్శనం చేసుకున్నారు. ఆల య ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.

మెట్లపై జారిపడి వృద్ధుడు మృతి

టెక్కలి రూరల్‌: స్థానిక శంభానవీధికి చెందిన ఆట్ల మధుసూదనరావు(64) అనే వృద్ధుడు బుధవారం తన ఇంటి ముందు ఉన్న మెట్లు పైనుంచి జారిపడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మధుసూదనరావు మంగళవారం వేకువజామున తన ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు తన ఇంటి మెట్లు పైనుంచి జారి పడిపోయారు. ఇటీవల నూతనంగా డ్రైనేజీ పనుల్లో భాగంగా ఇంటి ముందు వేసిన కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌కు బలంగా ఢీకొనడంతో గాయాలయ్యాయి. దీంతో వృద్ధుడిని హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ వృద్ధుడు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై అతని భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రామయ్యపట్నంలో అలుగు

సోంపేట: మండలంలోని రామయ్యపట్నంలో అలుగు ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన మత్స్యకారుడు జోగారావు ఇంటి పెరట్లో ఉన్న వలలో అలుగు చిక్కుకుంది. అలుగును గుర్తించిన మత్స్యకారుడు సురక్షితంగా వల నుంచి తీసి రక్షించారు. అటవీశాఖాధికారులకు సమాచారం అందజేశారు. కాశీబుగ్గ రేంజ్‌ అధికారి మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని అలుగుని స్వాధీనం చేసుకున్నారు. అంతరించిపోతున్న అలుగులను రక్షించాలని మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అటవీశాఖాధికారులు పలువురు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

ఇచ్ఛాపురం రూరల్‌: పట్టణంలోని మున్సిపల్‌ బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జి.చందన, ఎం.హారిక, కె.కావేరి ఖో–ఖో అండర్‌–18(జూనియర్స్‌) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం బల్ల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన పాఠశాలలో వ్యాయోమాపాధ్యాయురాలు కె.లత, విద్యార్థులను అభినందించారు. వీరు ఈనెల 14 నుంచి 16 వరకు కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన 45వ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరుపున పాల్గొని విజయం సాధించారు. ఈనెల 21 నుంచి 25 వరకు గుజరాత్‌ వడోదరలో జరగనున్న పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరుపున పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గౌరీ, కాదా వెంకటరావు, పి.సురేందర్‌లు పాల్గొన్నారు.

చలో ఢిల్లీ విజయవంతం చేయాలి

శ్రీకాకుళం అర్బన్‌: ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 2026 డిసెంబర్‌ 12వ తేదీన న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్‌ ర్యాలీ’లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ ఎన్జీజీవో సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్‌లు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జాతీయ స్థాయిలో ఉద్యమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. కర్మచారి ఆక్రోస్‌ ర్యాలీ ద్వారా ప్రధానంగా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement