● హర్యానాలోని ఆర్థిక వ్యవహారాల్లో వ్యక్తి కీలక పాత్ర
● ఆర్థిక మోసాలే ప్రవృత్తిగా చెలామణి
● కమీషన్ ఎరవేసి బ్యాంకు
అకౌంట్లు సేకరించడంలో దిట్ట
కాశీబుగ్గ: హర్యానాలో ఆర్థిక వ్యవహారాల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడడంలో కీలక పాత్ర పోషించిన కేటుగాళ్లలో ఒకరు పలాస మండలం అల్లుఖోల గ్రామస్తుడే అన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ఈ వ్యక్తి పుట్టి పెరిగింది కోల్‌కతాలోనే. పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. పదిహేనేళ్ల వయసులోనే జల్సా జీవితానికి అలవాటుపడ్డాడు. ఇందులో భాగంగానే సులువుగా సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లతో జట్టుకట్టాడు. వారు అడ్డదారుల్లో దోచిపెట్టిన సొమ్మును జమ చేయడానికి అకౌంట్ల అవసరం వచ్చింది. ఇందులో భాగంగానే అకౌంట్ల సేకరణకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన వ్యక్తికి కమీషన్ ఆశజూపి ఉచ్చులో దించినట్లు తెలుస్తోంది. జమ అయిన మొత్తంలో 30 శాతం కమీషన్‌గా తీసుకోవాలనే ఆఫర్ ప్రకటించడంతో ఆశకు పోయిన నగరంపల్లి వ్యక్తి ఈ ఉచ్చులో చిక్కుకున్నాడు.
పదేళ్ల కిందటే కేసు నమోదు
అల్లుఖోలకు చెందిన ఈ వ్యక్తిపై పదేళ్ల కిందటే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళను మోసగించాడంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. హిందీ, తెలుగుతో పాటు వచ్చీ రాని ఇంగ్లిష్‌లో తన మాటలతో పదిమందిని ఆకర్షించడంలో దిట్టగా ఎదిగాడు. ఈ విద్యతోనే పలాసకు చెందిన ఓ మహిళను ముగ్గులో దించాడు. ఆమె నుంచి పెద్ద మొత్తంలో నగదు కాజేశాడు. అన్ని రకాలుగా అవసరాలు తీర్చుకున్నాడు. మోసపోయిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది.
మూడు నెలలకో కారు..
మాయమాటలు చెప్పడం, మోసాల చేయడంలో ఆరితేరిన ఈ ప్రబుద్ధుడు.. సమాజంలో స్థితిమంతునిగా, పెద్ద మనిషిగా చెలామణి అయ్యేందుకు ఖరీదైన కార్లలో తిరుగుతుంటాడు. ఫైనాన్స్‌పై కారును తీసుకుంటాడు. మొదటి మూడునెలలపాటు ఈఎంఐ చెల్లిస్తాడు. ఆపై కట్టకుండా కొన్నాళ్ల పాటు తప్పించుకు తిరుగుతాడు. వారు పట్టుకుంటే దాన్ని వదిలేసి మరో కారును ఫైనాన్స్‌పై తీసుకురావడం అతనికి పరిపాటిగా మారిపోయింది.
విచారిస్తే మరిన్ని వెలుగులోకి..
ప్రస్తుతం వజ్రపుకొత్తూరు నగరంపల్లికి చెందిన వ్యక్తిని హర్యానా పోలీసులు విచారిస్తున్నారు. అతనికి సైబర్ నేరగాళ్ల పరిచయం ఎవరి ద్వారా జరిగింది? తన దగ్గరినుంచి బ్యాంకు అకౌంట్‌ను సేకరించింది ఎవరు? ఆ వ్యక్తికి, అల్లుఖోల గ్రామస్తునికి మధ్య సంబంధాలు, ఫోన్ సంభాషణలు, ఆర్థిక లావాదేవీలు ఏమేర జరిగాయన్న వివరాలు విచారణలో వెలుగుచూసే అవకాశముంది.


