● వైస్ చైర్‌పర్సన్‌గా ఒకరికే ఛాన్స్
● గత ప్రభుత్వంలో ఇద్దరు
వైస్ చైర్‌పర్సన్లకు అవకాశం
● జెడ్పీ పీఠంపై వీడని ఉత్కంఠ
అరసవల్లి: జిల్లా పరిషత్ పీఠంపై మరోసారి మహిళ పాలన మొదలుకానుంది. ఇటీవల వెలువడిన ‘పరిషత్’ ఎన్నికల ఫలితాల్లో 30 మండలాల్లో 29 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న కూటమి పార్టీలకు చెందిన మహిళా జెడ్పీటీసీయే జిల్లా పరిషత్ పీఠమెక్కనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నుంచి ఈ పరోక్ష ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా ఉదయం 10 గంటల్లోపు ఇద్దరు జెడ్పీ కోఆప్టెడ్ సభ్యుల నామినేషన్లు, తర్వాత మొత్తం 30 మంది జెడ్పీటీసీలకు ప్రిసైడింగ్ అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కోఆప్టెడ్ సభ్యులను చేతులెత్తే విధానంలో ఎన్నుకుంటారు. సింగిల్ నామినేషన్లు అయితే కోఆప్టెడ్ సభ్యులిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. వీరి ప్రమాణ స్వీకారాలు జరిగిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశానికి నోటీసు జారీ చేస్తారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ ఎన్నిక జరుగనుంది. జెడ్పీటిసీలంతా కలిసి చేతులెత్తే విధానంలో ఎన్నుకోనున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌ను కూడా చేతులెత్తే విధానంలో ఎన్నుకుంటారు.
పీఠంపై వీడని సస్పెన్స్..
జిల్లాలో 30 మండలాల్లో 29 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందగా, నరసన్నపేటలో మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జెడ్పీటీసీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, ఎల్.ఎన్ పేట, సరుబుజ్జిలి, మందసలో జనసేన అభ్యర్ధులు, హిరమండలం, జి.సిగడాంలలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా, మిగిలిన 22 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ పీఠం బీసీ–మహిళకు కేటాయించడంతో ఎవరికి పీఠం వరిస్తుందో అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కూటమి పార్టీల సర్దుబాటు, మిత్రధర్మం ప్రకారం ముందుగా జెడ్పీ పీఠంలో కాపు లేదా..కాళింగ సామాజిక వర్గ మహిళలకే జెడ్పీ చాన్స్ అంటూ ప్రచారం జరిగింది. తర్వాత కూటమిలో మిత్ర పార్టీల వారీగా చర్చలొచ్చి... జనసేనకు లేదా...టీడీపీకి పదవి వరిస్తుందని ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చేసింది. హిరమండలం సెంటిమెంట్‌ను ఇప్పుడు తెరమీదకు తెచ్చారు. 2021 జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాలకు 37 జెడ్పీటీసీలను గెలుచుకోగా.. ఒకే ఒక్క టీడీపీ జెడ్పీటీసీగా హిరమండలం అభ్యర్థే గెలుపొందాడు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ ప్రాదేశికం నుంచి ఎన్నికై న బీజేపీ జిల్లా అధ్యక్షుని భార్యకు అవకాశమివ్వాలంటూ డిమాండ్ ప్రచారంలోకి వచ్చింది. ఇదిలావుంటే తాజాగా జిల్లా కేంద్రం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని జనసేనకు కేటాయించడంతో జెడ్పీ పీఠంలో జనసేన ఆశలు దాదాపుగా ఆవిరైనట్లే కనిపిస్తోంది. కూటమి మిత్ర ధర్మం ప్రకారం జెడ్పీ పీఠం బీజేపీకే.. అంటూ ఆ పార్టీ శ్రేణులు సంబర పడుతున్నారు. మరోవైపు టీడీపీకే అత్యధిక జెడ్పీటీసీలున్నాయని.. కళింగ కమ్యూనిటీ మహిళకు అవకాశమివ్వాలంటూ ఆమదాలవలస జెడ్పీటీసీ తమ్మినేని సుజాత లాబీయింగ్ చేశారని సమాచారం. ఆమదావలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కి మంత్రి పదవి దక్కాలనే సామాజిక డిమాండ్ నెరవేర్చని క్రమంలో అదే నియోజకవర్గంలో జెడ్పీటీసీగా గెలిచిన ఆయన బంధువుకే జెడ్పీ పీఠం ఇవ్వాలంటూ వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. కింజరాపు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన కోటబొమ్మాళి జెడ్పీటీసీ కూడా మరోవైపు ప్రయత్నాలను తెరవెనుక చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాళింగులకు ఇప్పటికే నగర మేయర్ పదవికి రిజర్వ్ చేసిన కూటమి అధిష్టానం మళ్లీ కాళింగ సామాజికవర్గాన్ని జెడ్పీ పీఠం ఎక్కిస్తుందా..అన్న అనుమానాలు లేకపోలేదు. ఏదిఏమైనా జిల్లా పరిషత్ పీఠంపై అధిష్టానం మౌనంగా ఉండడంతో ఆశవహుల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది.
నాడు ఇద్దరు..నేడు ఒక్కరే
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు వైస్ ఛైర్‌పర్సన్లను నియమించారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఒకరే వైస్ ఛైర్‌పర్సన్‌ను కొనసాగించాలంటూ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులే విమర్శిస్తున్నారు.


