!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
పుర ఎన్నికల సాక్షిగా కూటమిలో సం‘కుల’ సమరం ఆరంభమైంది. నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికల్లో కూటమి వెలమ, కాపు, కళింగ వైశ్యులకు మొండి చేయి చూపింది. జిల్లాలో తొలి విడత ఇచ్ఛాపురం, పలాస, పాలకొండలో ఎన్నికలు జరిగిపోయాయి. రెండో విడతగా శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఆమదాలవలస, రాజాం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. జిల్లాలో రాజకీయంగా, సామాజిక పరంగా కీలక పాత్ర పోషించే వెలమ, కాపు, కళింగ వైశ్య సామాజిక వర్గాలకు కీలక పదవుల కేటాయింపులో కూటమి మొండి చేయి చూపింది. తొలి విడతలో జరిగిన ఇచ్ఛాపురం, పలాస, పాలకొండలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రెండో విడతలో జరుగుతున్న శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాంలో కూడా చోటు కల్పించకపోవడంతో ఆయా సామాజిక వర్గాలు గుర్రుగా ఉన్నాయి.
తొలి విడతలో ఎన్నికలు జరిగిన ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో రెడ్డిక సామాజిక వర్గానికి కూటమి, వైఎస్సార్‌సీపీ నుంచి ప్రాధాన్యత దక్కింది. పలాసలో వైఎస్సార్‌సీపీ కళింగ వైశ్య సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వగా, టీడీపీ నుంచి కాళింగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. పాలకొండ నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వగా, టీడీపీ మరో సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చింది. ఆమదాలవలస మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానాన్ని కూటమి, వైఎస్సార్‌సీపీ రెండూ కాళింగ సామాజిక వర్గానికే ఇచ్చాయి. రాజాం మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కాపు సామాజిక వర్గానికి కేటాయించగా, దేవాంగుల సామాజిక వర్గానికి కూటమి కేటాయించింది.
మొత్తం ఉమ్మడి జిల్లాలో ఒక నగర పాలక సంఘం, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి గాను మూడు కాళింగ సామాజిక వర్గానికి, ఒకటి రెడ్డిక సామాజిక వర్గానికి కూటమి కేటాయించింది. అదే వైఎస్సార్‌సీపీ విషయానికి వస్తే ఇచ్ఛాపురం స్థానాన్ని రెడ్డిక, పలాస స్థానాన్ని కళింగ వైశ్య, పాలకొండ స్థానాన్ని కాపు సామాజిక వర్గాలకు కేటాయించగా, శ్రీకాకుళం నగర పాలక మేయర్‌ను వెలమ సామాజిక వర్గం నుంచి గుండ లక్ష్మీదేవి, ఆమదాలవలస స్థానాన్ని కాళింగ సామాజిక వర్గానికి చెందిన బొడ్డేపల్లి అజంతా కుమారికి, రాజాం మున్సిపల్ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించింది. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ కాపు, వెలమ, కాళింగ, వైశ్య, రెడ్డిక సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వగా, కూటమి పార్టీలు కాపు, వెలమ,వైశ్య సామాజిక వర్గాలకు కనీసచోటు కల్పించలేదు. దీంతో ఆయా వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఆవేదనతో ఉన్నాయి.
గడిచిన సాధారణ ఎన్నికల్లోనూ వెలమ, కాపు, కాళింగ, మత్స్యకార సామాజిక వర్గాలకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసింది. గడిచిన ప్రభుత్వంలో కాపు, కాళింగ, వెలమ, యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చింది. అదే విధంగా వెలమ, కాళింగ, మత్స్యకార సామాజిక వర్గాలకు స్పీకర్, మంత్రి పదవులను అందించింది.
● అదే టీడీపీ విషయానికి వస్తే గడిచిన ఎన్నికల్లో మత్స్యకారులకు చోటు కల్పించలేదు.
● కాళింగులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
● ఇక కూటమి ప్రభుత్వంలో కూడా రెండు మంత్రి పదవులను ఒకే ఫ్యామిలీకి ఇచ్చి మిగతా సామాజిక వర్గాలను విస్మరించింది. సామాజిక వర్గాల సమతుల్యత విషయంలో కూటమి అనుసరించిన తీరుపై జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.
● ఓట్లు కావాలి గానీ.. పదవులు కేటాయించరా అని ప్రశ్నిస్తున్నారు.
మేయర్, చైర్ పర్సన్ అభ్యర్థుల
కేటాయింపుల్లో సామాజిక సమతుల్యత పాటించని కూటమి
కాపు, వెలమ, కళింగ వైశ్యులకు రిక్తహస్తం
ఓటుతో బుద్ధి చెబుతామంటున్న ఆయా వర్గాలు
సామాజిక సమతుల్యత చేసి చూపించిన వైఎస్సార్ సీపీ


