కూటమిలో పితలాటకం | - | Sakshi
Sakshi News home page

కూటమిలో పితలాటకం

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

● కూటమిలో జెడ్పీ పేచీ

● రేసులో సుజాత, శైలజ, భవానీ

● ఒప్పందం ప్రకారం జెడ్పీ తమదే

అంటున్న జనసేన

● జెడ్పీ ఇస్తే లాస్‌ అవుతామంటున్న టీడీపీ శ్రేణులు

జెడ్పీ

పీఠం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లాలో టీడీపీ జనసేన మధ్య పోరు ముదిరి పాకాన పడుతోంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠా న్ని దక్కించుకోవడానికి రెండు పార్టీల నాయకులు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పీఠాన్ని అధిరోహించేందుకు ముగ్గురు మహిళా నేతలు రేసులో నిలిచారు. టీడీపీ తరఫున సీనియర్‌ నాయకురాలు తమ్మినేని సుజాతతో పాటు కోటబొమ్మాళి జెడ్పీటీసీ పూజారి శైలజ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధిష్టానం వద్ద లాబీయింగ్‌ చేస్తూ పీఠం తమకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. కాగా జనసేన తరఫున ఎల్‌ఎన్‌పేట జెడ్పీటీసీ కొరికాన భవానీ రేసులో ఉన్నారు. పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులు, సూచనలతోనే తాను జెడ్పీటీసీగా పోటీ చేశానని ప్రచారం చేసుకుంటున్నారు.

మాకే ఇచ్చారంటున్న జనసేన

కూటమి ముందస్తు సీట్ల సర్దుబాటు, అంతర్గత ఒప్పందాల ప్రకారం ఈ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఇప్పటికే తమ పార్టీకే కేటాయించారని జనసేన నాయకత్వం గట్టి నమ్మకంతో ఉంది. అయితే, దీనిపై టీడీపీ ఆశావహులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఐదుగురు జెడ్పీటీసీలున్న జనసేనకు ఈ పదవిని వదిలేస్తే, భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీ ఉనికికే ఇబ్బందికరంగా మారుతుందని, క్యాడర్‌ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని తమ్ముళ్లు వాదిస్తున్నారు. ఈ మేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్యేలకు భవిష్యత్‌ గుబులు

ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన, అంతర్గత కోణం వెలుగు చూస్తోంది. జెడ్పీ పీఠంపై ఎవరైనా కొత్త ముఖాలను లేదా కొత్త వారిని కూర్చోబెడితే.. భవిష్యత్‌లో వారు తమ సీటుకే ఎసరు పెడతారేమోనని స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల్లో సరికొత్త భయం మొదలైంది. టీడీపీ నుంచి ఆమదాలవలస జెడ్పీటీసీ తమ్మినేని సుజాత మొద టి నుంచి ప్రయత్నాల్లో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్‌ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ నుంచే అసలు సమస్య అని చర్చించుకుంటున్నారు. తమ్మినేని సుజాతకు జెడ్పీ ఇస్తే భవిష్యత్‌లో తనకు పోటీగా తయారవుతారని, ఎప్పటి నుంచో ఎమ్మె ల్యే టికెట్‌ను ఆశిస్తున్న సుజాతకు ఇదొక మంచి అవకాశమని, తన భవిష్యత్‌ రాజకీయాలకు అడ్డు తగులుతారనే అభిప్రాయంతో కూన రవికుమార్‌ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. అసలు సుజాత జెడ్పీటీసీగా పోటీ చేయడమే కూనకు ఇష్టం లేదని సమాచారం. బీఫారం ఇవ్వడానికి చివరి నిమిషం వరకు ఆపేసినట్టు పార్టీలో వాదన ఉంది. ఎక్కడి నుంచి ఎవరి ఒత్తిడి వచ్చిందో గానీ సుజాతకు పార్టీ బీఫారం ఇవ్వక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నెగ్గడం, జెడ్పీ చైర్‌పర్సన్‌ కోసం గట్టిగా ప్రయత్నించడంతో కూన శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆమెకు పీఠం దక్కకుండా పావులు కదుపుతున్నారు.

భయాందోళనలో మామిడి..

పాతపట్నం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ నియోజక వర్గ పరిధిలో ఎవరికీ జెడ్పీ చైర్‌పర్సన్‌ ఇవ్వకూడదనే ఆలోచనలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఉన్న ట్టు వాదన నడుస్తోంది. ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా జనసేనకు చెందిన సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌, భవానీ ఇప్పటికే పోటీగా తయారయ్యారు. మామిడి గోవిందరావు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్యే తప్పులను, అక్రమాలను ఎత్తి చూపడమే కాకుండా ప్రతి విషయంలోనూ మామిడిని టార్గెట్‌ చేసేలా రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొరికాన భవానీకి జెడ్పీ చైర్‌పర్సన్‌ ఇస్తే తన భవిష్యత్‌కు ముప్పు వాటిల్లుతుందని మామిడి ఆందోళనలో ఉన్నారు. అదే విధంగా అదే నియోజకవర్గంలో లోతుగడ్డ శ్రీదేవి కూడా టీడీపీ నుంచి జెడ్పీటీసీ ఎన్నికై ఉన్నా రు. ఆయన భర్త లోతుగడ్డ తులసీదాస్‌ క్రియాశీలక నాయకుడు. వారికిచ్చినా తనకే ఇబ్బంది అనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో చైర్‌పర్సన్‌ పదవి ఎవరికిచ్చినా ఫర్వాలేదు కానీ తన నియోజకవర్గంలో ఎవరికీ దక్కకూడదనే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట నియోజకవర్గాల్లో కూడా ఉంది.

కింజరాపు వారు మరో రకం

జనసేనకు జెడ్పీ కేటాయించారన్న ప్రచార నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఎక్కడా ఖండించడం లేదు. అలాగని, టీడీపీకే వస్తుందని చెప్పడం లేదు. వాస్తవంగా కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని తమ్మినేని సుజాత మొదటి నుంచి ముందుకెళ్తున్నారు. కింజరాపు, కూన రవికుమార్‌ మధ్య అంతర్గత రాజకీయ విభేదాల నేప థ్యంలో బంధువైన కూన రవికుమార్‌ను వదిలి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెంట నడుస్తు న్నారు. దానితో సుజాతపై కూన మొదటి నుంచి గుర్రుగా ఉన్నారు. తమకు విధేయరాలిగా ఉన్న సుజాతకు జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చే విషయంలో నోరు మెదపడం లేదు. ఇప్పటికే తమ ఇంట్లో రెండు పదవులు ఉన్నాయని, ఆ నినాదంతోనే కూన రవికుమార్‌ వ్యతిరేకమయ్యారని, ఈ పరిస్థితుల్లో సుజాత కోసం నిలబడి గట్టిగా అడిగితే కొత్త సమస్యలు వస్తాయని తీవ్ర స్థాయిలో ప్రయత్నించడం లేదని భోగట్టా. ఈ పరిస్థితుల్లో తన నియోజక వర్గ పరిధిలోని కోటబొమ్మాళి జెడ్పీటీసీ పూజారి శైలజను తెరపైకి తెచ్చారని, ఆమె కూడా కాళింగ సామాజిక వర్గం కావడంతో వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. ఒకవేళ కాదూ కూడదంటే జనసేనకు వదిలేయడానికి కింజరాపు బాబాయ్‌ అబ్బాయ్‌లు సిద్ధమని కూడా ప్రచారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement