నూనె.. మంచిదేనా? | - | Sakshi
Sakshi News home page

నూనె.. మంచిదేనా?

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

●

● నూనెల వినియోగంపై కొరవడిన నిఘా

● నామమాత్రపు తనిఖీలతో కాలయాపన చేస్తున్న ఆహార భద్రత అధికారులు

● గాలిలో దీపంలా ప్రజారోగ్యం

సాధ్యమైనంత దూరంగా ఉండండి

నూనెను పదే పదే అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే అందులో ఆక్రిలామైడ్‌, ఫ్రీ రాడికల్స్‌ వంటి కేన్సర్‌ కారకాలు విడుదలవుతాయి. ఆ నూనె లో వేయించిన ఆహారం తింటే కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్‌, అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాలేయంపై ప్రభావం చూపి ఫ్యాటీ లివర్‌, వాపు సమస్య తలెత్తే ప్రమాదముంది. అధిక రక్తపోటు, టైప్‌–2 మధుమేహం బారిన పడతారు. కాబట్టి బయటి ఆహారాన్ని సాధ్యమైనంతమేర పరిహరించడం ఉత్తమం. – డాక్టర్‌ తమ్మినేని పాపినాయుడు,

సూపరింటెండెంట్‌, పలాస సామాజిక

ఆరోగ్య ఆస్పత్రి

విషంతో సమానం

నూనెను పలుమార్లు మరిగించినప్పుడు అందులోని రసాయన నిర్మాణం మారి విషపూరితంగా మారుతుంది. అలాంటి వాటితో వండిన వంటకాలు తింటే గుండెపోటు సంభవిస్తుంది. ముఖ్యంగా ఇటీవల యువతలో హృద్రోగ సమస్యలకు ప్రధాన కారణం ఆరుబయట ఆహార పదార్థాలు తీసుకోవడమే.

– డాక్టర్‌ కూన మోహన్‌ బాబు, జనరల్‌ మెడిసిన్‌

కాశీబుగ్గ:

టీపీసీ.. అంటే టోటల్‌ పోలార్‌ కాంపౌండ్‌. నూనె వంటకు వాడే ముందు దానికి ఆ అర్హత ఉందా లేదా అని పరీక్షించే ప్రక్రియ ఇది. మనం తరచుగా బజార్లలో తింటున్న బజ్జీలు, టిఫిన్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వాడే నూనెకు ఈ తరహా పరీక్ష చేసి తీరాలి. కానీ జిల్లాలో ఇలాంటి పరీక్ష జరిగిన దాఖలా ఒక్కటి కూడా లేదు. ఫలితంగా కేన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులు గతం కంటే వేగంగా ప్రబలుతున్నాయి.

ఒకే ప్యాకెట్‌ నూనెతో రోజంతా వంటలు చేసి ఆ నూనె నల్లగా మాడిపోయేంత వరకు వండి మన కు వడ్డిస్తున్నారు. ఆహార ప్రియులు కూడా ఆబగా తింటున్నారు. నాలుకపై రుచిగా ఉండే పదార్థం కడుపులోకి వెళ్లాక విషంగా మారుతోంది. అసలు ఆ నూనె ఎక్కడిది? మంచిదేనా? వాడిన దాన్నే మళ్లీ ఉపయోగిస్తున్నారా.. అన్న సంగతి జనాలకు పట్టడం లేదు. విచిత్రంగా పరిశీలించాల్సిన అధికారులకు కూడా ఈ విషయం పట్టడం లేదు. ఫలితంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ జబ్బుల బారిన పడుతున్నారు.

రూ.70 నూనెతో వంటకాలు

మార్కెట్‌లో వాడే నూనె రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. కానీ ఈ టిఫిన్‌ షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు వాడే నూనెను చాలా మంది ప్యాకెట్‌ రూ.70 పెట్టి కొంటున్నారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌ల నిర్వాహకులు రెండు, మూడుసార్లు వాడేసిన తర్వాత తోపుడుబండ్లు, బడ్డీ కొట్లలో చిరుతిళ్లు అల్పాహారం విక్రయించే వ్యాపారులకు అదే నూనెను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆ నూనెను ఇంకో పదిసార్లు వాడి ఇక్కడ వంటకాలు తయారు చేస్తున్నారు.

యువ రక్తం చెడిపోతోంది

16 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు కేన్సర్ల బారిన పడుతున్నారు. జిల్లాలో అనుమానిత కేన్సర్ల కేసులు పెరుగుతున్నట్లు నేషనల్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్సీడీ) 4.0 సర్వేలో తేలింది. ఆరుబయట దుకాణాల్లో లభించే ఆహార పదార్థాలను రోజులో ఒకసారైనా వీరు తీసుకోవడమే అన్నది ప్రధాన కారణాల్లో ఒకటి. వారంలో కనీసం మూడు సార్లు ఆరు బయట దుకాణాలు, రెస్టారెంట్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే ప్యాకెట్‌లో నిల్వ ఉంచిన చిప్స్‌, మైదాతో వేయించిన స్నాక్స్‌ను తీసుకుంటున్నారు. దీంతో వీరి రక్తం కలుషితమవుతోందని వైద్యారోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement