శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్టు) కేసులను కక్షిదారులు రాజీ మార్గంలో సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ ఉత్తమ అవకాశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో 21వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలి ఆదేశాల మేరకు కేసుల సత్వర పరిష్కారానికి రెండు ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొదటి బెంచ్‌ను పోక్సో కోర్టు వేదికగా ఏర్పాటు చేసి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అదనపు జిల్లా న్యాయస్థానాల పరిధిలోని చెక్ బౌన్స్ క్రిమినల్ అప్పీళ్లను పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి, న్యాయవాద సభ్యురాలు డి.అమృత సమక్షంలో పరిష్కరిస్తారని వివరించారు. రెండో బెంచ్‌ను మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏర్పా టు చేసి, ప్రిన్సిపల్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ప్రత్యేక ఎకై ్సజ్, మొబైల్ కోర్టుల పరిధిలోని కేసులను సంబంధిత న్యాయాధికారి, న్యాయవాద సభ్యురాలు పి.అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో విచారిస్తారని తెలిపారు.
అందాల బ్రహ్మ కమలం
ఇచ్ఛాపురం రూరల్: మశాఖపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి భీమారావు ఆచారి ఇంటి ఆవరణలో అరుదైన బ్రహ్మ కమలం పుష్పం మంగళవారం రాత్రి వికసించి చూపరులను ఆకట్టుకుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూస్తుందని పేరున్న ఈ పుష్పం రాత్రివేళ వికసించి తెల్లవా రు జామున వాడిపోవడం దీని ప్రత్యేకత.
తవ్వుకుపోతున్నారహో..
కంచిలి: మండపల్లి రెవెన్యూ పరిధిలో గల కొండలో అక్రమంగా కంకర తవ్వకాలను మూడు రోజులుగా చేపడుతున్నారు. బాహాటంగా పెద్ద పెద్ద ట్రక్కుల్లో ప్రభుత్వ పోరంబోకు, డీ పట్టా భూముల నుంచి తవ్వుకొని దర్జాగా తీసుకెళ్లిపోతున్నారు. పైగా ఈ లోడ్ల లారీలు రాకపోకలు సాగించేటప్పుడు ఆ మార్గంలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఎవరిని ఢీకొంటాయో తెలియని అయోమయంలో ఆ ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. మండపల్లి సర్వే నంబర్ 1లో కొండలో ఇంత గా కంకర తవ్వకాలు చేపడుతూ పూర్తిగా కొండనే కనుమరుగు చేస్తున్నా స్థానిక రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణం అని స్థానికులు వాపోతున్నారు. పైగా ఆ తవ్వకాలు చేపడుతున్న వారిని ప్రశ్నిస్తే తమకు కలెక్టర్ అనుమతి ఉందని చెబుతున్నారు. ఈ కంకరను వరద ప్రభావిత రోడ్లు పూడ్చడానికి వినియోగించడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు తీసుకెళ్తున్నామని చెప్పడం విశేషం. ప్రభుత్వ అవసరాలకు వినియోగించాల్సి వచ్చినప్పటికి కూడా తగిన అనుమతులతో గుర్తింపు పొందిన క్వారీల్లోనే తవ్వకాలు చేపట్టి వినియోగించాల్సి ఉంది. కానీ ఇక్కడ గుర్తింపులేని కొండలో ఇలా అడ్డగోలుగా తవ్వుతూ కంకరను మాయం చేస్తున్న దుండగులు.. తమకు అను మతులున్నాయంటూ బుకాయించడం విశేషం. దీనిపై అధికార యంత్రాంగం వెంటనే స్పందించి తవ్వకాలను నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, స్థానికులు కోరుతున్నారు.
‘సైబర్ మోసాల ఉచ్చులో పడొద్దు’
కాశీబుగ్గ: ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ మోసాలపై విశ్రాంత ఉద్యోగులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తూర్పుకోస్తా రైల్వే విశాఖపట్నం డివిజన్ ఏడీఆర్‌ఎం కుందు రామారావు సూచించారు. పలాసలో మంగళవారం తూర్పుకోస్తా రైల్వే విశాఖపట్నం డివిజన్ పర్సనల్ విభాగం, బ్యాంక్ ప్రతినిధుల సమన్వయంతో ‘నేషన్‌వైడ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్’ నిర్వహించారు. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ విధానంపై విశ్రాంత ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం రామారావు మాట్లాడుతూ, ఇటీవల ఓ విశ్రాంత ఉద్యోగి తన మొబైల్‌లో యుమిడ్ కార్డు అప్‌డేట్ చేసుకునే క్రమంలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.84 లక్షలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో చైతన్యవంతం కావాలని సూచించారు.
కంకరను తరలిస్తున్న ట్రక్కు


