పొలం గట్లపై ఉండే ఎలుక బొరియలు ఇవే
పిలక దశలో ఉన్న వరి పైరు
పైరును కొరికేస్తున్న ఎలుకలు
గుళ్లబారిపోతున్న పొలం గట్లు
బెంబేలెత్తుతున్న రైతులు
వజ్రపుకొత్తూరు : రైతన్నలను మూషికాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఆహారపు ధాన్యాలను నాశనం చేస్తూ తరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఖరీఫ్ వరి పొట్ట దశకు చేరకుంటున్న తరుణంలో తీపిగా ఉండే దుబ్బు, పిలకలను ఎలకలు తినేస్తున్నాయి. వాటి నివారణకు ఏం చేయాలో తోచక అన్నదాతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మూషికాల బారి నుంచి వరి పైరును ఎలా సంరక్షించుకోవాలో రాజమండ్రి వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్‌వీ నరసింహారావు రైతులకు పలు సూచనలు చేశారు.
ఎలుకల దాడి మొదలు..
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,59,226 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. ఇందులో స్వర్ణ, సాంబమసూరి రకాలే ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలాచోట్ల సెప్టెంబరు మొదటి వారం దాటితే గానీ ఉభాలు పూర్తి కాలేదు. చాలాచోట్ల వెద పద్ధతి ద్వారా నాటడంతో వేగంగా పెరిగి దుబ్బు కట్టే దశకు చేరుకున్నాయి. పిలకలు, పొట్ట తీపిగా ఉండడంతో ఎలుకలు వాటిని కొరికి బొరియల్లోకి తీసుకెళుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో ఎలుకలను నివారించే వ్యవస్థ లేకపోవడంతో ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ఎలుకలను సామూహికంగా నివారించేందుకు ప్రభుత్వం ఎలుకలు పట్టే బుట్టలు గానీ, బ్రోమోడయలిన్ మందును గానీ పంపిణీ చేయాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే..
బొరియ వద్ద మట్టి పోగులుగా, ఉండలుగా కనిపిస్తుంది. మట్టి ఉండలు తడి తడిగా ఉంటాయి. ఎలుక విసర్జన పదార్థాలు తడిగా కనిపిస్తాయి, అక్కడక్కడా ఎలుకల పాదముద్రలు కనిపిస్తాయి.
ఎర మందు అమర్చడంతో పాటు సస్యరక్షణగా పొలం గట్లు శుభ్రం చేసుకోవడం, ఎలుకల కన్నాల్లో పొగను ఊదరగొట్టించాలి.
రైతులు ఏం చేయాలంటే..:
గ్రామంలోని రైతులంతా కలిసి ఓ యూనిట్‌గా ఏర్పడి సామూహికంగా ఎలుకల నివారణకు చర్యలు చేపట్టాలి.
బ్రోమోడయోలిన్ 0.25 నీలి ఎలుకల మందు 2 శాతం విషపు ఎరగా తయారు చేసుకోవడం కోసం 96 పాళ్లు నూకలు, 2 గ్రాముల నూనె, 2 గ్రాముల బ్రోమోడయోలిన్ మందును కలపాలి.
విషపు ఎర తయారు చేసే సమయంలో చేతులకు గ్లౌజులు, పాలిథీన్ సంచి తొడుక్కోవాలి. మందులో ఉండే మనిషి చేతి వాసనను ఎలుక పసి గట్టి ఎరను స్వీకరించదు.
ఒక్కొక్క ఎలుక బొరియకు 10 గ్రాముల ఎరను కాగితంలో పొట్లంగా చుట్టి ఎలుక కన్నంలో అంగులం లోపల పెట్టాలి. పొట్లాలు అమర్చిన అనంతరం బొరియను మూసి వేయకూడదు.
ఎర మందు 12 గంటలు దాటాక వాసనను ఎలుకలు పసిగడతాయి. ఈ మిశ్రమాన్ని మధ్యాహ్నం కలిపి సాయంత్రంలోపు అమర్చాలి. ఎలుకలు నిశాచరులు కాట్టి సాయంత్రం నుంచి మరసటి రోజుల ఉదయం వరకు స్వీకరించే అవకాశం ఉంది.
జింక్ పాస్పైడ్ ఎరను ఎకరాకు కిలో నుంచి 1.5 కిలోలను బొరియకు 5–10 గ్రాములు పెట్టాలి.
చనిపోయిన ఎలుకలను ఏరి లోతుగా పూడ్చేయాలి.
పొగబారించే యంత్రం(బర్రోఫ్యూమిగేటర్)తో ఎలుక బొరియలను కప్పి రెండు నుంచి మూడు నిమిషాల ఎలుక బొరియల్లోకి పొగపెడితే వాటిలో ఉంటే తల్లి, పిల్ల ఎలుకలు పూర్తిగా చనిపోతాయి. తొలకరి చినుకుల అనంతరం పంట భూమిని దుక్కి చేయాలి. రైతులు పొలంగట్లపై కాకుండా పోరంబోకు భూములు, ఖాళీ ప్రదేశాల్లో విషపు ఎరను పెట్టి ఎలుకల నివారణ చర్యలు చేపట్టాలి. ఎలుక బొరియలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పొగ పెట్టడం మంచిది.
తీవ్ర నష్టం..
ఎలకాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. మన రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల ఆహాధాన్యాలను అన్నదాతలు నష్టపోతున్నారు. రైతులు సామూహికంగా ఎలుకలను నిర్మూలించేందుకు ముందుకు రావాలి. ఇందుకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా పొలం ఎలుక, చిట్టెలుకతో రైతులు జాగ్రత్త పడాలి. – డాక్టర్ సీహెచ్‌వీ నరసింహారావు,
శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం
రైతులు దృష్టిపెట్టాలి..
ఎలుకలు నివారించేందుకు బ్రోమోడయోలిన్ మనకు ప్రభుత్వం నుంచి సరఫరా కావడం లేదు. రైతులు యాజమాన్య పద్ధతుల్లో భాగంగా వీటిని నివారించుకోవాలి. వరి దుబ్బులు, తీపిగా ఉండడం వల్ల పొట్ట దశలోనే ఎలుకలు వీటిని కొరికి రైతులకు నష్టం కలిగిస్తాయి. ఎలుక బొరియలను గుర్తించి అందులో విషపు ఎరలు, ట్రాప్‌లు ఏర్పాటు చేసుకోవాలి.
– బమ్మిడి ధనుంజయరావు, ఏఓ, వజ్రపుకొత్తూరు


