వైఎస్సార్‌ సీపీ డిజిటల్‌ బుక్‌లోకి బొడ్డేపల్లి శైలజ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ డిజిటల్‌ బుక్‌లోకి బొడ్డేపల్లి శైలజ

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

గల్లంతైన వ్యక్తి మృతి గార/ఆమదాలవలస: ఆమదాలవలస మండలం లక్ష్ముడిపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి సత్యం(76) గార సమీపంలో వంశధార నది ఒడ్డున విగతజీవిగా కనిపించాడు. గార పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యంకు మతి స్థిమితం లేకపోవడంతో పాటు అప్పుడప్పుడు ఫిట్స్‌ వచ్చేది. ఈ నెల 3న బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో బంధువుల ఇళ్లు, సమీప గ్రామాల్లో వెతికారు. కుమారుడు విజయకుమార్‌ ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేశారు. మంగళవారం నదిలో మృతదేహాన్ని స్థానికులు గమనించడంతో పోలీసులు పరిశీలించి సత్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలుగు చంద్రమోహన్‌ తెలిపారు.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అన్యాయం జరిగితే ఎంతటివారినైనా క్షమించబోమని వైఎస్సార్‌ సీపీ డిజిటల్‌ బుక్‌ చైర్మన్‌ శిమ్మ రాజశేఖర్‌ మంగళవారం హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగాలే తప్ప అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని వైఎస్సార్‌సీపీ నాయకులను అణగదొక్కాలని చూస్తే సహించేది లేదన్నారు. ఈ నెల 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శ్రీకాకుళం మండలానికి రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన మెప్మా పీడీ బొడ్డేపల్లి శైలజ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ తన విధులను, అధికారాలను దుర్వినియోగం చేయడం అన్యాయమన్నారు. ఈ మేరకు శైలజను వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ బుక్‌లో నమోదుచేసి భవిష్యత్తులో తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ అధికారులంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధుల్లా పనిచేయాలే తప్ప పక్షపాతంతో పనిచేయడం సరికాదన్నారు. అధికార పార్టీ ప్రయోజనాలే పరమావధిగా, ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్పకూల్చేలా మెప్మా పీడీ వ్యవహరించిన తీరుపై ప్రజలంతా ఛీత్కరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఓట్లుతో గెలిచిన అభ్యర్థులకు బదులుగా ఓడిపోయిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం దారుణమన్నారు. ఇప్పటికే పొందూరు మండలం ఆర్‌ఓగా పనిచేసిన డీఎస్‌ఓ సూర్యప్రకాష్‌.. ఫోర్జరీ సంతకాలతో ఐదుగురు ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించినందుకు డిజిటల్‌ బుక్‌లోకి మొదటి వ్యక్తిగా ఎక్కించామని గుర్తు చేశారు.

108లో ప్రసవం

గార: గొర్లెవానిపేట గ్రామానికి చెందిన జి.యమునకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో గ్రామస్తులు 108 సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. వాహనం ద్వారా తరలించేందుకు అనువుగా లేకపోవడంతో టెక్నీషియన్‌ హరీష్‌ అంబులెన్సులోనే ప్రసవించేలా చేశారు. పండంటి మగబిడ్డ జన్మించడంతో కళింగపట్నం పీహెచ్‌సీకి తరలించారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

గార : కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన వి.కొర్లయ్య వ్యక్తిగత కారణాలతో పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంగళవారం సాయంత్రం సచివాలయం సమీపంలో తనపై తానే పెట్రోల్‌ పోసుకున్నాడు. తర్వాత మంట అంటించుకోవడంతో స్థానికులు గమనించి ఆర్పివేశారు. అనంతరం 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

తుఫాన్‌ బియ్యం పంపిణీలో వివక్ష తగదు

కవిటి : కవిటి పంచాయతీ జాలారిపాలెం, పుక్కళ్లపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు తుఫాన్‌ బియ్యం పంపిణీ చేయకుండా వివక్ష చూపడం తగదని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం కవిటి తహసీల్దార్‌ టి.కల్యాణచక్రవర్తిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన బియ్యం పునఃపరిశీలన చేసి పంపిణీలో లోపాల్ని సవరించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మత్స్యకార గ్రామాల నాయకులు ఢిల్లీబు, హిమాచలం, కృష్ణారావు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement