శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి బరిలో ఉంటారని, ఎన్నిక సమయంలో తానే జనరల్ ఏజెంట్‌గా ఉంటానని, తాడోపేడో తేల్చుకుందామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో రాజ్యాంగ విరుద్ధంగా, అక్రమాలకు పాల్పడిన అధికారుల పేర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పొందూరులో నామినేషన్లు వేసిన అభ్యర్థులను దొంగ సంతకాలతో రిటర్న్ చేసిన రిటర్నింగ్ అధికారి గుంట సూర్యారావు పేరును, అలాగే శ్రీకాకుళంలో గెలిచిన అభ్యర్థులకు బదులుగా ఇతరులను విజేతలుగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి బొడ్డేపల్లి శైలజ పేరును డిజిటల్ బుక్‌లో నమోదు చేశామన్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల పరిణామాలను చూసి కొంత ఆందోళన ఉండవచ్చని, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. నాయకులంతా పూర్తి సమయం కేటాయించి ఓటరు జాబితాపై పూర్తి పట్టు సాధించాలన్నారు. జాబితాపై సమగ్ర అవగాహన, ప్రతి ఓటరుతో నిరంతర సంబంధం ఎన్నికల్లో మన విజయానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి డివిజన్‌కు ఒక న్యాయవాదిని అప్పగించి పర్యవేక్షిస్తామన్నారు.
● మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ మీకు అండగా నేనుంటానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతా సమష్టిగా పనిచేసి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం కార్పొరేషన్‌ని గెలిచి జగన్‌మోహన్‌రెడ్డికి, ధర్మాన సోదరులకు బహుమతిగా అందివ్వనున్నామని ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎం.వి.స్వరూప్, ఎన్ని ధనుంజయరావు, చల్ల శ్రీనివాసరావు, కోణార్క్ శ్రీనివాసరావు, సాధు వైకుంఠరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, అంధవరపు రామారావు, మండవల్లి రవి, పొన్నాడ రుషిలతో పాటు 60 డివిజన్ల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
జనరల్ ఏజెంట్‌గా నేనే ఉంటా..
రాజ్యాంగ విరుద్ధగా అధికారులు
వ్యవహరిస్తే డిజిటల్ బుక్‌లోకి ఎక్కిస్తాం
శ్రీకాకుళం కార్పొరేషన్ డివిజన్ నాయకులతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు


