పోర్టు పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోర్టు పనులు వేగవంతం చేయాలి

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ అధికారులను ఆదేశించారు. సంతబొమ్మాళి మండలంలో నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టును మంగళవారం ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో ప్రవీణ్‌ ఆదిత్యతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్ట్‌ పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. బ్రేక్‌ వాటర్‌, రిక్లమేషన్‌ పనులు, మూడు జనరల్‌ కార్గో బెర్తులు, ఒక కోల్‌ బెర్తు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. సుమారు 82 శాతం పనులు పూర్తయ్యాయని, ఆఫ్‌షోర్‌ సదుపాయాలు, బాహ్య మౌలిక వసతుల పనుల వివరాలను విశ్వసముద్ర కంపెనీ చైర్మన్‌ సీహెచ్‌ శశిధరరావు మ్యాప్‌ ద్వారా వివరించారు. మొత్తంగా మూలపేట పోర్టు నిర్మాణ పనులు 93 శాతం వరకు పూర్తయ్యాయని పోర్టు అధికారులు వెల్లడించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోర్టుకు అనుసంధానంగా నిర్మించాల్సిన బాహ్య రహదారులు, రైల్వే మార్గం అలైన్‌మెంట్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. 12.5 కిలోమీటర్ల దక్షిణ దిశ బాహ్య రహదారి నిర్మాణానికి సంబంధించిన ఈఎస్‌పీ డ్రాయింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దక్షిణ బ్రేక్‌వాటర్‌కు సంబంధించి 950 మీటర్ల వేవ్‌వాల్‌ నిర్మాణాన్ని మూడు నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. మూడు బెర్తులకు సంబంధించిన ఫిల్లింగ్‌ పనులను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. డ్రెడ్జింగ్‌కు సంబంధించి 13 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌), పవర్‌ గ్రిడ్‌, గెయిల్‌ సంస్థలకు సంబంధించిన పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, డిప్యూటీ కలెక్టర్‌ వెంకట్రావు, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ సత్యనారాయణ, ఏపీ మారిటైమ్‌ బోర్డు పర్యవేక్షక ఇంజనీర్‌ పద్మశ్రీ, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్‌ హేమసుందరరావు, ప్రాజెక్టు మానిటరింగ్‌ కన్సల్టెంట్‌ (పీఎంసీ) బృందం ప్రతినిధి అనిల్‌కుమార్‌, పోర్టు అధికారులు పాల్గొన్నారు.

మూలపేట పోర్టు పనులను పరిశీలిస్తున్న కార్యదర్శి, కలెక్టర్‌ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement