ఆమదాలవలస: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ మంగళవారం ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధనా స్థానాలను సందర్శించారు. శాస్త్రవేత్తలు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గిరిజన ప్రాంత రైతులు, షెడ్యూల్ కుల రైతులకు సాంకేతికతపై సమీక్ష నిర్వహించడంతో పాటు విత్తనోత్పత్తికి అపరాల విత్తనాలను, ఉద్యానవన నారును అందజేశారు. అనంతరం మేలైన రకాల వరి, అపరాలపై అవగాహన కల్పించారు. రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఇటీవల విడుదలైన చిరు సంచి (మినీ కిట్) రకం ఆర్.జి.ఎల్– 7038 వరి వంగడం ఉల్లికోడు, దోమపోటు, మెడ విరుపు, ఎండాకు తెగులను తట్టుకుంటుందని, శ్రీకాకుళం జిల్లాకు అత్యంత అనుకూలమైన రకమని చెప్పారు. కార్యక్రమంలో కె.వి.కె.ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, నైరా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.చిన్నం నాయుడు, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


