● టెక్కలిలో సీఐ విజయకుమార్ అత్యంత దాష్టీకంగా ప్రవర్తించారు ● వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై, పోలింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిజాయితీకి మారుపేరుగా ఉన్న జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ కోటబొమ్మాళి మండలంలో దారుణంగా రిగ్గింగ్ చేసుకున్నారని, టెక్కలిలో సీఐ విజయకుమార్ పూర్తిగా టీడీపీ కార్యకర్తగా మారిపోయి టీడీపీ అభ్యర్థులు రిగ్గింగ్ చేసుకునే విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. టెక్కలి–4వ ప్రాదేశికం అభ్యర్థి మామిడి జ్యోతి భర్త కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులైన మహిళలపై సీఐతో పాటు పోలీసులు అత్యంత దాష్టీకంగా ప్రవర్తించారని తిలక్ మండిపడ్డారు. పోలింగ్ ముందు రోజు నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వారిని వెంబడించి మరీ అక్రమంగా అరెస్టులు చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కొంత మంది పోలీస్ అధికారులతో ఎన్నికల్లో రిగ్గింగ్‌లకు పాల్పడతారని గతంలో చెప్పినప్పటికీ ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసులు రెచ్చిపోయి రిగ్గింగ్‌లకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.
టెక్కలి లో 1 నుంచి 8 ప్రాదేశికాలు, తొలుసూరుపల్లి, చాకిపల్లి, నరసింగపల్లి, అక్కవరం కోటబొ మ్మాళి మండలంలో పట్టుపురం, పెద్దబమ్మిడి, వాండ్రాడ, గట్లపాడు, చిన్న బమ్మిడి, చిట్టెవలస, ఎత్తురాళ్లుపాడు, సాలిపేట, నారాయణవలస, తాటిపర్తి, నీలంపేట, నందిగాం మండలం పెద్దతామరాపల్లి, రాంపురం, నౌగాం, కల్లాడ, కాపు తెంబూరు, బడగాం, పెద్దలవునిపల్లి, నందిగాం–2, సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం, కోటపాడు, ఆకాశలక్కవరం పోలింగ్ బూత్‌లలో టీడీపీ కార్యకర్తలు దారుణంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
ఆయనతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి కర్ణిక జీవనరావు, నాయకులు సత్తారు సత్యం, వి.శ్రీధర్‌రెడ్డి, ఆట్ల రాహుల్, కె.అజయ్, బి.కార్తీక్, బి.గోవిందరావు, చింతాడ జీవన్, మామిడి కృష్ణ, జె.తిరుమలరెడ్డి, బి.రాకేష్, బి.రాజేష్, బి.ఉదయ్, బి.భుజంగరావు, బి.జయరాం, ఎస్.హరినారాయణ, బి.తేజేశ్వరరావు, కె.సునీల్, పి.రమణబాబు తదితరులు ఉన్నారు.


