ఒక్కోచోట ఒక్కోలా..
చేతులేత్తేసిన టీడీపీ, జనసేన అధిష్టానాలు
ఫ్రెండ్లీ ఫైట్ పేరుతో ఒకేచోట రెండు పార్టీలు బీ ఫారాలు ఇచ్చిన పరిస్థితి
జిల్లాలో ఆసక్తికర రాజకీయం
ఎన్నికలు జరుగుతున్న 523 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 523 స్థానాల్లో బరిలో ఉంది. టీడీపీ 478, జనసేన 74, బీజేపీ 24 ఇలా మొత్తం 576 మంది బరిలో నిలవడం కూటమి పొత్తు ధర్మంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదంతా పార్టీ సింబల్ పై జరుగుతున్న పోటీ. ఒక జనసేన పోటీ చేసిన చోట టీడీపీ, టీడీపీ పోటీ చేసిన చోట జనసేన, బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ నాయకులు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న స్థానాలు చాలానే ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
స్థానిక పోరులో కూటమి పార్టీలు ఒక్క తాటిపై నిలవలేకపోయాయి. ఒకవైపు కలిసి పనిచేయాలని చెబుతూనే, మరోవైపు ఎవరికి వారే పోటీ చేసేందుకు బీఫారాలు ఇచ్చాయి. దీంతో ఒకే చోట టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ పోటీ చేసిన చోట జనసేన, జనసేన పోటీ చేసిన చోట టీడీపీ, బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన పోటీ పోటీ పడుతున్నాయి. పైగా దీనికి ఇరుపార్టీల అధిష్టానాలు ప్రోత్సహించి, బీ ఫారాలు ఇవ్వడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా పొత్తులో ఒక పార్టీ పోటీ చేస్తే మరో పార్టీ డ్రాప్ అవ్వాలి. కానీ జిల్లాలో అందుకు భిన్నంగా అధిష్టానాలు వ్యవహరించాయి. దీంతో ఆశావహులు టికెట్ దక్కలేదన్న ఆవేదనతో ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. టెక్కలి నియోజకవర్గంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ధర్మం పాటించలేదు. జనసేనకు, బీజేపీకి ఒక్క స్థానం కేటాయించలేదు.
నరసన్నపేట నియోజకవర్గంలోని అందవరంలో టీడీపీ, బీజేపీ, జనసేన పోటీ చేస్తున్నాయి. మూడు చోట్ల ఆయా పార్టీలు బీ ఫారాలు ఇచ్చాయి. అదేవిధంగా టీడీపీ పోటీ చేస్తున్న మూడు చోట్ల బీజేపీ బీఫారాలతో పోటీలో ఉన్నారు. టీడీపీ పోటీ చేస్తున్న మరో 10చోట్ల జనసేన అభ్యర్థులు బీఫారాలతో బరిలో ఉన్నారు.
కంచిలిలో జనసేనకు ఇచ్చిన మూడింటిలో, టీడీపీ వాళ్లకి బీ ఫారాలు ఇచ్చారు. కవిటి మండలంలో జగతి స్థానానికి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తే టీడీపీ అభ్యర్థి విత్‌డ్రా చేసుకోకుండా ఇండిపెండెంట్‌గా ఉండిపోయారు. కపాసుకుద్దిలో జనసేనకు జనసేన నాయకుడు రెబెల్‌గా ఉన్నారు. ఇచ్ఛాపురం మండలంలో టీడీపీ పోటీ చేస్తున్న తులసీగాం, కేసుపురం, లొద్దపుట్టి, బూర్జపాడులో ఇండిపెండెంట్‌గా జనసేన వాళ్లు ఉన్నారు.
నందిగాంలో పెద్ద లవునిపల్లి, సైలాడలో టీడీపీ, జనసేనకి బీ ఫారాలు ఇచ్చారు. దీంతో ఇరువురు ఢీకొట్టుకుంటున్నారు. హరిదాసుపురంలో టీడీపీకి, బీజేపీకి బీ ఫారాలు ఇచ్చారు. సంతబొమ్మాళిలో ఆరు చోట్ల జనసేన బీఫారాలతో, ఒకచోట బీజేపీ బీ ఫారంతో టీడీపీ పోటీ చేసిన చోట బరిలో ఉన్నారు.
టెక్కలిలో కూడా టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో రెండు చోట్ల జనసేన బీ ఫారాలతో ఇద్దరు, బీజేపీ బీ ఫారాలతో ఒకరు బరిలో ఉన్నారు. కోటబొమ్మాళిలో కూడా టీడీపీ పోటీ చేస్తున్న చోట జనసేన బీ ఫారాలతో ఒకరు, బీజేపీ బీఫారాలతో ఒకరు బరిలో ఉన్నారు.
హిరమండలం పిండ్రువాడలో టీడీపీ బరిలో ఉన్న చోట జనసేన బీ ఫారంతో ఒకరు పోటీ చేస్తున్నారు. మెళియాపుట్టిలో బీజేపీకి ఇచ్చిన కరజాడలో జనసేన బీ ఫారంతో ఒకరు పోటీ చేస్తున్నారు. టీడీపీ బరిలో ఉన్న చాపర, కొసమాల, భరణికోటలో జనసేన బీ ఫారాలతో జనసేన నాయకులు పోటీలో ఉన్నారు. పాతపట్నంలో టీడీపీ బరిలో ఉన్న తెంబూరులో బీజేపీ బీ ఫారంతో ఒకరు పోటీలో ఉండగా, టీడీపీ పోటీ చేస్తున్న పాతపట్నం 3లో జనసేన బీ ఫారంతో ఒకరు బరిలో ఉన్నారు. కాగువాడలో టీడీపీతో పాటు జనసేన నాయకులు ఆయా అధిష్టానాలు ఇచ్చిన బీఫారంతో ఢీ కొంటున్నారు. కొత్తూరులో టీడీపీ పోటీ చేస్తున్న చోట ఎనిమిది చోట్ల జనసేన బీఫారాలతో పోటీలో ఉన్నారు. ఎల్‌ఎన్‌పేటలో ఒక ఎంపీటీసీ స్థానానికి టీడీపీ రెబెల్స్ ఉన్నారు.
రణస్థలం మండలంలో టీడీపీ పోటీ చేస్తున్న జేఆర్‌పురం 1లో జనసేన బీ ఫారంతో ఆ పార్టీ నాయకులు బరిలో ఉన్నారు. అదేవిధంగా మండలంలో మూడు చోట్ల జనసేన నాయకులు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.
లావేరు మండలంలోని పాతకుంకాం, కొత్త కుంకాంలలో జనసేన నాయకులు ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. జి.సిగడాంలో గెడ్డ కంచరాంలో బీజేపీ బరిలో ఉండగా టీడీపీ నాయకుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. టీడీపీ పోటీ చేస్తున్న జీ.సిగడాం, జాడ, బాతువలో టీడీపీ నాయకులు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.
ఆమదాలవలసలో జెడ్పీటీసీకి టీడీపీ నుంచి సనపల సౌమ్య రెబెల్‌గా అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. సరుబుజ్జిలిలో మతలబుపేటలో టీడీపీ నాయకుడు ఇండిపెండెంట్‌గా ఉన్నారు.
శ్రీకాకుళంలో పెద్ద గనగళ్లవానిపేట, పొన్నాంలో టీడీపీ, జనసేన బీఫారాలతో రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి. రాగోలు, ఎస్‌ఎస్ వలస, కల్లేపల్లి, కనుగులవానిపేటలో టీడీపీ నాయకులు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.
గార మండలంలో రామచంద్రాపురంలో జనసేన నాయకుడు ఇండిపెండెంట్‌గా ఉన్నారు. టీడీపీ పోటీ చేస్తున్న కళింగపట్నం 2, శ్రీకూర్మం 1లో జనసేన బీఫారాలతో ఆ పార్టీ నాయకులు పోటీకి సై అంటున్నారు.
వజ్రపుకొత్తూరు మండలంలో టీడీపీ పోటీ చేస్తున్న చోట జనసేనకు చెందిన నలుగురు స్వతంత్రులుగా ఉన్నారు.


