సాధారణ పరిస్థితుల పునరుద్ధరణపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

సాధారణ పరిస్థితుల పునరుద్ధరణపై దృష్టి

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

● పక్కాగా నష్టాల ప్రాథమిక అంచనా ● కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

● పక్కాగా నష్టాల ప్రాథమిక అంచనా ● కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: తుఫాన్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణపై దృష్టి సారించాలని, ఎక్కడా జాప్యం లేకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పక్కాగా నష్టాల ప్రాథమిక అంచనాలు రూపొందించాలని అధికారులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి కంట్రోల్‌ రూమ్‌ అధికారులతో సమీక్షించారు. అంతకుముందు కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో కలెక్టర్‌ నేరుగా మాట్లాడారు. తుఫాన్‌ తగ్గిన అనంతరం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వర్షాల వల్ల ఎదురైన సమస్యల వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తుఫాన్‌ తగ్గినా వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికే ఈదురుగాలులు, వర్షాల కారణంగా రహదారులపై ఎక్కడైనా చెట్లు కూలడం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటివి జరిగి ఉంటే తక్షణమే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులతో మాట్లాడుతూ.. రోడ్లు, వంతెనలు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు వాటిళ్లిన నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్షిస్తూ.. జిల్లాలో వరి, అరటి, కొబ్బరి తదితర పంటలకు జరిగిన నష్టాలపై క్షేత్రస్థాయిలో సర్వేను వెంటనే ప్రారంభించి, ఏ ఒక్క రైతూ నష్టపోకుండా పారదర్శకంగా జాబితాలు రూపొందించాలని ఆదేశించారు. మరోవైపు జిల్లాలో ప్రవహిస్తున్న వంశధార, నాగావళి నదులతో పాటు ప్రధాన గెడ్డలు, జలాశయాల నీటి మట్టాలు, ప్రస్తుత వరద ప్రవాహ పరిస్థితిని జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. లోతట్టు, ముంపు బారినపడిన గ్రామాల్లో తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, తాగునీటి పథకాలను పునరుద్ధరించి క్లోరినేషన్‌ చేయాలన్నారు.

నీటి ప్రవాహం పెరిగే అవకాశం

జిల్లాలో తుఫాన్‌ ప్రభావం తగ్గుముఖం పట్టినా, ప్రధాన నదులకు వరద ముప్పు పొంచి ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ముందస్తు చర్యలతో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా నివారించామన్నారు. వంశధార నదికి ప్రస్తుతం 16 వేల క్యూసెక్కుల వరద ఉండగా, ఒడిశా రాష్ట్రం గుణుపూర్‌, రాయగడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అది లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందన్నారు. అలాగే నాగావళికి 50 వేల క్యూసెక్కుల వరద వస్తోందని, ఇది కూడా లక్ష క్యూసెక్కులు దాటే ప్రమాదం ఉండటంతో పరివాహక ప్రాంతాలైన బూర్జ, శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలాల ప్రజలను అప్రమత్తం చేసి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు 190 మంది గర్భిణులు, బాలింతలను సురక్షితంగా ఆస్పత్రులకు తరలించామని, జిల్లావ్యాప్తంగా 102 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 120 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 11 కచ్చా ఇళ్లు కూలిపోగా, సుమారు 5,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు నీటమునిగాయని, 160 హెక్టార్లలో కూరగాయల పంటలకు నష్టం వాటిళ్లిందని వెల్లడించారు. కంచిలి, కవిటి తదితర ఉద్దానం ప్రాంతాల్లో 500 కొబ్బరి చెట్లు నేలకూలాయని అంచనా వేశారు. అలాగే 27 చోట్ల రోడ్లపై పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ పునరుద్ధరించామని, విరిగిపడిన 53 విద్యుత్‌ స్తంభాలకు మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement