మహిమ అపారం..! | - | Sakshi
Sakshi News home page

మహిమ అపారం..!

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

మట్టి గోలేం.. ● భక్తుల నమ్మకానికి ప్రతీకగా శ్రీముఖలింగం గర్భగుడిలో గోలేం ● కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం ● నేటి నుంచి ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు కార్తీక మాసం ప్రారంభం

మట్టి గోలేం..
● భక్తుల నమ్మకానికి ప్రతీకగా శ్రీముఖలింగం గర్భగుడిలో గోలేం ● కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం ● నేటి నుంచి ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు కార్తీక మాసం ప్రారంభం

జలుమూరు:

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రం కాశీకి తుల్యమైనదిగా అభివర్ణిస్తారు. ఇక్కడ కోటికి ఒక్క లింగం తక్కువ కావడంతో కాశీ అంతటి పుణ్యక్షేత్రం కావాల్సింది.. దక్షిణ కాశీగా మిగిలిపోయిందని చరిత్ర చెబుతోంది. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలిగమని, ఇక్కడ కొలువైన శివుడిని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశీలో లింగం, గంగలో స్నానం.. శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

గోలేం కథ ఇది

స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టుకి వెనుక పెద్ద మట్టి గోలేం ఉన్నది. అది ఎంత పెద్ద గోలేమంటే గర్భాలయం ద్వారం పట్టనంత. శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్న ఎన్నో ఏళ్లుగా సంతానం లేకుండా బాధపడుతుంటాడు. సంతానం కోసం స్వామివారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలేం చేసి దాని నిండా ఆవుపాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు. మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి గోలేం చేసి దాని నిండా పాలుపోసి దానిని గర్భాలయంలోనికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భ గుడి ద్వారం పట్టనంత పెద్ద గోలేం అవ్వడంతో గర్భాలయంలోనికి తీసుకెళ్లలేకపోయాడు. దీంతో ఆలయం ముఖమంటపంలోనే విడిచిపెట్టి ఎంతో దుఖిస్తూ గోలేంతోపాటు తనకు ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా అక్కడే వదిలి ఇంటికి వెళ్లిపోతాడు. మర్నాడు స్వామివారి నిత్యపూజల కోసం అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలేం మూలవిరాట్టు వెనకాల ఉన్నది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలేం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటున్నాడు. ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహాత్యాన్ని తెలుసుకొని సుత్తించారు.

కోర్కెలు తీర్చే నాగాభరణుడు

ఈ గోలేంలో పాలుతో పాటు బియ్యం, వడ్లు(ధాన్యం), మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం ఇలా భక్తుల మొక్కులకు అనుగుణంగా ఆ గోలేం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. దీనికి ఫలితంగా సంతాన యోగం, గ్రహా దోషాల నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాల్లో చదువులు ఇతర న్యాయమైన కోర్కెలు తీరుతాయని స్థల పురాణంతో పాటు అర్చకులు చెబుతున్నారు. ఇలా తమ కోర్కెలను తలచుకొని ఆ గోలేంను ముట్టికొని ఆ పరమేశ్వరుడిని నిండు మనుసుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు కొద్దికాలంలో తీరుతాయన్నది భక్తులు నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా శ్రీముఖలింగం గోలేం వర్థిల్లుతోంది.

నేటి నుంచి కార్తీక మాసం

మన రాష్ట్రంలోని రాయలసీమతో పాటు ఒడిశా, చత్తీష్‌ఘడ్‌ తదితర రాష్ట్రాలు వారు గౌరీ పౌర్ణమి అనంతరం కార్తీక మాసం పాటిస్తారు. దీంతో వారికి గురువారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇదే నెలలో ఎక్కువగా దైవ చింతన, గుడులు, తీర్థయాత్రలు చేయడం వారి సంప్రదాయం. దీనిలో భాగంగా శ్రీముఖలింగానికి ఈనెల రోజులపాటు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement