అనుమానాలున్నాయి
● పలుమార్లు ఎన్నికల అధికారులు ఇచ్చిన జాబితాల్లో కనిపించని అభ్యర్థుల పేర్లు ● కోటబొమ్మాళి ఆర్వో తీరుపై మండిపడుతున్న అభ్యర్థులు
టెక్కలి: ఈ చిత్రంలో కనిపిస్తున్నది కోటబొమ్మాళి మండలం ఎంపీటీసీ అభ్యర్థుల తుది జాబితా. ఇందులో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల వివరాలతో 41 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు బుధవారం విడుదల చేసిన జాబితా.
ఈ చిత్రంలో కనిపిస్తున్న జాబితా కూడా అదే కోటబొమ్మాళి మండలం ఎంపీటీసీ అభ్యర్థుల తుది జాబితా. ఇందులో మాత్రం కేవలం వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులతో 34 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు బుధవారం విడుదల చేసిన జాబితా.
ఈవిధంగా ఒకే కార్యాలయం నుంచి రెండు వేర్వేరు జాబితాలు విడుదల చేశారు. ఈ రెండు జాబితాలు పోల్చితే కొంతమంది అభ్యర్థుల పేర్లు గల్లంతు కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్వో తీరుపై ఆరోపణలు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోటబొమ్మాళి మండలం ఆర్వో కె.జగన్మోహన్‌రావు తీరుపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్ల సమయంలో ఏకపక్షంగా వ్యవహరించారని దుమ్మెత్తిపోస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు సొంత శాఖకు చెందిన అధికారి కావడంతో టీడీపీకి అనుకూలంగా నామినేషన్ ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా చేశారంటూ విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్దబమ్మిడి, చిన్నసాన, దంత ప్రాదేశికాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేవిధంగా వ్యవహరించారంటూ ఆయా అభ్యర్థులు దుమ్మెత్తి పోస్తున్నారు.
కోటబొమ్మాళి మండలం ఆర్వో జగన్మోహన్‌రావు తీరుపై అనుమానాలు ఉన్నాయి. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖకు చెందిన అధికారిని ఎన్నికల అధికారిగా నియమించుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే విధంగా చేశారు. ఎన్నికల అధికారి తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయించి ఆయన చేసిన తప్పిదాలపై శిక్ష పడేలా చేస్తాం.
– దుబ్బ వెంకటరమణరావు, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, కోటబొమ్మాళి మండలం


